దుర్గమ్మ కానుకల చోరీ కేసులో ట్విస్ట్‌

6 Jun, 2019 12:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ : దుర్గమ్మ కానుకల చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. మంగళవారం అమ్మవారి కానుకలు లెక్కించే సమయంలో కానుకలతో పాటు కొంత నగదు కూడా అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ ఉద్యోగి సింహాచలంతో పాటు అతడి భార్య దుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా హుండీలోని కానుకలతో పాటు, రూ. 10 వేల నగదును తీసుకున్న సింహాచలం వాటిని సంచిలో వేసుకున్నట్లు సీసీటీవీలో రికార్డయింది. అయితే ఈ కేసులో మరో ఇద్దరికి కూడా ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

చోరీ చేసిన అనంతరం కొండ దిగువకు వచ్చే క్రమంలో సింహాచలం.. దుర్గారావు వ్యక్తికి కొంత నగదు ఇవ్వడం, ఆ తర్వాత అతడు నేరుగా ప్రసాదం కౌంటర్‌ దగ్గరకు వెళ్లడం సీసీటీవీలో కనిపించింది. ఈ నేపథ్యంలో సింహాచలం రెండో భార్య రమణకు ఇచ్చేందుకే నగదు అపహరించినట్లుగా పోలీసులు భావించడంతో వారిద్దరిని కూడా అరెస్టు చేశారు. కాగా ఈ వ్యవహారంలో ఆలయ సిబ్బందితో పాటు సెక్యూరిటీ అధికారులపై కూడా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దుర్గగుడిలో నిఘాను మరింత పటిష్టం చేస్తామని కోటేశ్వరమ్మ తెలిపారు. హుండీల లెక్కింపు సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

రక్షణకు రూ.లక్షలలో వ్యయం..
అమ్మవారి ఆలయంలో భద్రతా విధులు నిర్వహించే సిబ్బంది వేతనాల కోసం దేవస్థానం ప్రతి నెలా రూ.లక్షలలో వెచ్చిస్తుంది. అయితే  అమ్మవారి సొమ్మును కాపాడటంతో భద్రతా వ్యవస్థ పూర్తి వైఫల్యం చెందింది. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో మల్లికార్జునపేటకు చెందిన ఇద్దరు యువకులు కొండపై భాగానికి చేరుకోవడం ఆలయ భద్రత వ్యవస్థ పని తీరుకు అద్దం పడుతుంది. వారు పేకాట కోసమే కొండ ఎక్కారా లేక మరేదైనా అఘాయిత్యానికి పాల్పడేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా అనేది తేలాల్సి ఉండగా, పోలీసులు ఆ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా మూసేశారు.    

చేతివాటాన్ని ప్రదర్శించిందిలా..
ఆలయ ప్రాంగణంలోని హుండీలలోని నగదు , బంగారాన్ని ప్లాస్టిక్‌ సంచులలోకి ఎత్తే క్రమంలో సింహచలం తన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.  హుండీలలో నగదును సంచులకు ఎత్తే క్రమం అంతా ఎస్‌ఫీఎఫ్‌ సిబ్బంది , హోంగార్డులు,  ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది. ఆ సమయంలో భక్తులను గానీ , మీడియా సిబ్బందిని గానీ హుండీల వద్దకు అనుమతించరు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, కానుకలు లెక్కించే మహా మండపం ఆరో అంతస్తు అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. చుట్టూ కెమెరాలు, ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసు, సెక్యూరిటీ బందోబస్తు ఉన్నా.. సింహచలం ఏ విధంగా బంగారాన్ని, నగదును  దారి మళ్లిస్తున్నాడనే విషయం ఇప్పుడు అంతు పట్టడం లేదు.

మరిన్ని వార్తలు