బ్యాంకు కస్టమర్లకు ఆర్‌బీఐ తీపికబురు

6 Jun, 2019 12:26 IST|Sakshi

ముంబై  : గృహ, వ్యక్తిగత, వాహన రుణాల వినియోగదారులకు కేంద్ర బ్యాంక్‌ తీపికబురు అందించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా కీలక రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీరేటు (రెపో రేటు)ను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది.

కాగా, బ్యాంకులకు ఆర్‌బీఐ అందించే స్వల్పకాల రుణాలపై విధించే వడ్డీని రెపో రేటుగా పరిగణిస్తారు. రెపో రేటు తగ్గడంతో తదనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. బ్యాంకులు వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని మళ్లిస్తే ఆయా రుణాలపై వారు చెల్లించే నెలసరి వాయిదా (ఈఎంఐ)లు కొంతమేర దిగివస్తాయి.

పెట్టుబడుల మందగమనంతో పాటు ప్రైవేట్‌ వినిమయంలో వృద్ధి ఆశించిన మేర లేకపోవడంతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు మొగ్గుచూపింది. ఆర్థిక వృద్ధి మందగించడం, అంతర్జాతీయ ఆర్థిక అస్ధిరతల నేపథ్యంలో గత రెండు విధాన సమీక్షల సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున తగ్గించడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను 7.2 శాతం నుంచి ఏడు శాతానికి కుదించింది. తదుపరి ఎంపీసీ భేటీ ఆగస్ట్‌ 5 నుంచి 7 వరకూ జరుగుతుందని పేర్కొంది.


ఖాతాదారులకు ఊరట
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై ఛార్జీలను తొలగించింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా ఆన్‌లైన్‌ లావాదేవీలపై చార్జీల రద్దుతో ఖాతాదారులకు ఊరట కల్పించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు