మా విచారణ పూర్తికాలేదు 

27 Mar, 2019 05:34 IST|Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యా యత్నం కేసులో దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశ దాటలేదు

మేమింతవరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు

ఎన్‌ఐఏ కూడా సిట్‌ మాదిరే కేసులో ఏమీ తేల్చలేదంటూ మాట్లాడటం సరికాదు

ప్రభుత్వ పెద్దల తప్పుడు ఆరోపణలపై స్పందించిన ఎన్‌ఐఏ అధికారి సాజిద్‌ ఖాన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇంకా తమ విచారణ పూర్తి కాలేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారి మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌ వెల్లడించారు. ఇంకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు ఈ కేసును మొదటి నుంచీ తప్పుదోవ పట్టించేలా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో కుట్ర కోణమేదీ లేదని ఏకంగా ఎన్‌ఐఏ తేల్చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎన్‌ఐఏ అధికారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌పై.. టీడీపీ నేతకు చెందిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి నిందితుడు శ్రీనివాసరావు వైఎస్‌ జగన్‌ అభిమానే అంటూ తప్పుడు ప్రచారం చేశారు. హత్యాయత్నాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు. సిట్‌ కూడా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఈ కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేసి, సూత్రధారులు, కుట్రదారులను తప్పించారు.  

ఎన్‌ఐఏకు మొదట్నుంచీ సహాయనిరాకరణే.. 
చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ చేపట్టిన ఎన్‌ఐఏకు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ పోలీసులు సహాయ నిరాకరణ చేశారు. కేసు వివరాలు సైతం ఎన్‌ఐఏ అధికారులకు వెల్లడించలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా ఎన్‌ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఓ దశలో సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాలని యోచించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు విశాఖ పోలీసులు ఓ దశలో ఏకంగా కోర్టుకు కూడా ఈ కేసు సీడీ ఫైల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు.  ఎన్‌ఐఏ ప్రధాన దర్యాప్తు అధికారి (సీఐవో) మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌తో సహా అధికారుల బృందాన్ని విశాఖ పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో చార్జిషీట్‌ ఫైల్‌ తీసుకుని ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. ఆ ఫైల్‌లోని వివరాలు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. 

పదేపదే తప్పుడు ప్రకటనలు.. 
సీఎం చంద్రబాబు సిట్‌ మాదిరే ఈ కేసులో ఏమీ లేదంటూ ఎన్‌ఐఏ తేల్చేసిందని ఇష్టారీతిన పదేపదే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బహిరంగసభల్లో కోడికత్తి కేసుపై ఎన్‌ఐఏ వాళ్లు ఏం పీకారు.. మేం చెప్పిందే వాళ్లూ చెప్పారంటూ అసత్య ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ఎన్‌ఐఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మేమింకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి చేయలేదని సీఐవో సాజిద్‌ ఖాన్‌ వెల్లడించారు. విచారణ కొనసాగుతున్న దశలో.. వివరాలేమీ చెప్పలేమన్నారు.  

మరిన్ని వార్తలు