నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

14 Jul, 2018 13:08 IST|Sakshi
విలపిస్తున్న మృతురాలి తల్లి (ఇన్‌సెట్‌లో) రోజా మృతదేహం

తల్లిదండ్రులు గట్టిగా కసురుకున్నారని బాధపడ్డారుగానీ.. ఆ బిడ్డలు క్షణం లేకపోతే అమ్మానాన్న కంట్లో నీటి ఊట ఆగదని గుర్తించలేకపోయారు.. తమ ఇష్టాలను గౌరవించలేదని అపోహపడ్డారుగానీ.. పిల్లలకంటే వారికి లోకంలో ఏదీ ఇష్టంకాదనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు. యుక్త వయసుకొచ్చాక కూడా మాకు చెప్పేదేమిటని ఆలోచించారుగానీ.. ఈ వయసులోనే జీవన మార్గదర్శకులుగా నిలుస్తున్నారనే విషయాన్ని గమనించలేకపోయారు. తమ గుండెల్లో బాధను గుర్తించలేదని తొందరపడ్డారుగానీ.. బిడ్డలు ఒక్కపూట కానరాకపోతే వారి గుండె కొట్టుకోదనే విషయాన్ని మరిచిపోయారు. జిల్లాలోని తాడికొండలో యువకుడు, మంగళగిరిలో యువతి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేక నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. ఆ తల్లిదండ్రులకు నూరేళ్లకు సరిపడా విషాదాన్ని మిగిల్చారు.

మంగళగిరి టౌన్‌: తన పెళ్లి విషయంలో పెద్దలు మనస్తాపం చెందారని మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న ఓ నర్సింగ్‌ విద్యార్థిని శుక్రవారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నగరంకు చెందిన పి.రోజా పట్టణంలోని ఇందిరానగర్‌లో గత ఐదు నెలలుగా తన స్నేహితురాలితో అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఎమ్మెస్సీ నర్సింగ్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. కొద్ది రోజుల క్రితం గుంటూరుకు చెందిన ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించారు. అయితే వారు ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి నెల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. తాను వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతో తల్లిదండ్రుల పరువుపోతుందని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఇంట్లో వాళ్లు బాధపడటం ఇష్టంలేని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. చెల్లిని బాగా చదివించండి అని సూసైడ్‌ నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌నోట్‌ ఆధారంగా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రోజా మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
 

మరిన్ని వార్తలు