దొంగతనాల్లో పండిపోయాడు

7 May, 2019 09:14 IST|Sakshi
నిందితుని వివరాలను వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు

ఆరు పదుల వయసు చోరాగ్రేసరుడు!

సైకిల్‌పై రెక్కీ.. ఆపై దొంగతనాలు

అంతర్‌ జిల్లాల ఘరానా దొంగ అరెస్ట్‌

రూ.3.48 లక్షల సొత్తు స్వాధీనం

పూర్వాశ్రమంలో నిందితుడు బియ్యం వ్యాపారి

నెల్లూరు(క్రైమ్‌) : ఆరుపదులు దాటిన వయస్సు.. అయినా చోరీల్లో దిట్ట. సైకిల్‌పై రెక్కీ నిర్వహించడం..ఆపై దొంగతనాలకు పాల్పడటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతని కదలికలపై నిఘా ఉంచిన నెల్లూరులోని సంతపేట పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి రూ.3.48 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సంతపేట పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు నిందితుని వివరాలను వెల్లడించారు. అనంతపురానికి చెందిన బోయ్య సుబ్బరాయుడు బియ్యం వ్యాపారి. వ్యసనాలకు బానిసై దొంగగా మారాడు.

మాటలు కలిపి..
సైకిల్‌పై తిరుగుతూ  ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులతో మాటలు కలిపేవాడు. ఇంట్లో  ఎవరెవరు ఉంటారు? ప్రస్తుతం ఇంట్లో ఉన్నారా? ఎక్కడికి వెళ్లారు? వారి పేర్లు అడిగి తెలుసుకునేవాడు. ఎవరూ లేరని చెప్తే వెంటనే సదరు ఇంట్లోని వారు తనకు బాగా తెలుసని చెప్పేవాడు. బీరువాలో ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటిని తీసుకురమ్మని తనకు చెప్పారని చిన్నారులను నమ్మించి ఇంట్లోకి వెళ్లేవాడు. అనంతరం వారిని మాటల్లో దించి బీరువాను తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకెళ్లేవాడు. ఇలా నిందితుడు ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఈ తరహాలో దొంగతనాలు చేశాడు. ఇటీవల అతని భార్యకు అనారోగ్యంగా ఉండడంతో తిరుపతిలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించాడు. అక్కడినుంచి తన బంధువుతో కలిసి ఈనెల 30న నెల్లూరుకు వచ్చాడు. అదే రోజు నగరంలో అద్దెకు సైకిల్‌ తీసుకుని సంతపేట పరిసర ప్రాంతాల్లో దొంగతనానికి అనువుగా ఉండే ఇంటి కోసం రెక్కీ నిర్వహించాడు.

సంతపేటలో..
సంతపేట కొండూరువారి వీధికి చెందిన తిరుమల కామాక్షి ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా పనిచేస్తోంది. గత నెల 30న ఆమె ఎప్పటిలాగే కార్యాలయానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె శ్రీమహాలక్ష్మి పక్కింటి పిల్లలతో కలిసి ఇంటి ముందు ఆడుకోసాగింది. ఇది గమనించిన సుబ్బరాయుడు చిన్నారి వద్దకు వచ్చి మాటలు కలిపాడు. ఆమె తల్లిదండ్రుల ఇంట్లో లేరని తెలుసుకున్నాడు. అనంతరం బీరువాలో స్లిప్పులు ఉన్నాయని, అమ్మ తీసుకురమ్మని చెప్పిందని శ్రీమహాలక్ష్మికి చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం బీరువాను పగులగొట్టి బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల నగదు, 74 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు. ఇంట్లో నుంచి బయటకు వస్తూ సాయంత్రం అమ్మతో కలిసి ఇంటికి వస్తానని చెప్పి అక్కడినుంచి పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కామాక్షి బీరువాను తెరచి ఉండడంతో అందులో నగదు, బంగారు లేకపోవడాన్ని గమనించింది. అనంతరం కుమార్తె ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని అదేరోజు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై షేక్‌ సుభానీ తమ సిబ్బందితో కలిసి నిందితుని కోసం గాలించారు.

అరెస్ట్‌
సోమవారం ఉదయం సింహపురి హోటల్‌ సమీ పంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుం డటం వారు గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీ స్‌ స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలిలో అతని విచారణ చేసేసరికి చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి అతని వద్దనుంచి రూ.50 వేల నగదు, 74 గ్రాములు బంగారం (మొత్తం రూ.3.48 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన సంతపేట ఎస్సై షేక్‌ సుభానీ, కానిస్టేబుల్స్‌ సురేంద్ర, శివ, వెంకటరమణను ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు. త్వరలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా రివార్డులు అందిస్తామని తెలిపారు. నిందితుడిని వారెంట్‌పై అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నట్టు కోటేశ్వరరావు వెల్లడించారు.    

మరిన్ని వార్తలు