ఘరానా దొంగ మంత్రి శంకర్‌ మళ్లీ దొరికాడు

11 Sep, 2019 13:02 IST|Sakshi

రసూల్‌పురా: ఇళ్ళ తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడే ఘరానా దొంగ మంత్రి శంకర్‌ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు.  250 పైగా నేరాలు. 209 కేసులతో పాటు మూడుసార్లు పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లివచ్చినా అతను తన పంథా మార్చుకోలేదు. మంగళవారం మంత్రి శంకర్‌తో పాటు అతని అనుచరుడు దినకర్‌ను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 100 గ్రాముల బంగారం, ఆటో, హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై మరోసారి పీడీ యాక్ట్‌ నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం కార్ఖాన సీఐ మధుకర్‌స్వామి వివరాలు వెల్లడించారు. నార్త్‌జోన్‌ పరిధిలోని  తుకారం గేట్, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, కార్ఖాన ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ ఆదేశాల మేరకు రెండు బృందాలు  ఏర్పాటు చేశామన్నారు.

మంగళవారం జేబీఎస్‌ వద్ద అనుమానస్పదంగా కనిపించిన మంత్రి శంకర్, అతని అనుచరుడు దినకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించినట్లు తెలిపారు.  మూడోసారి పీడీ యాక్ట్‌ కింద అరెస్టయిన శంకర్‌ గత నెల 19న చర్లపల్లి జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. మరుసటి రోజు నుంచే పలు పీఎస్‌ల పరిధిలో  రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు దినకర్‌తో కలిసి చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. గత నెల 29న శ్రీపురికాలనీలోని రెండు ఆపార్ట్‌ మెంట్లలో చోరీకి యత్నిచినట్లు తెలిపారు. ఇతర పీఎస్‌ల పరిధిలో జరిగిన దొంగతనాలపై దృష్టి సారించి రెండు బృందాలు ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు