దడ పుట్టిస్తున్న దోపిడీలు

6 Apr, 2018 12:39 IST|Sakshi

దాడులకు వెనుకాడని దుండగులు 

ఉమ్మడి జిల్లాలో వరుస ఘటనలు 

ఒంటరిగా కనిపిస్తే చాలు.. 

తాళం వేసి వెళితే గ్యారెంటీ లేదు 

నియంత్రించలేకపోతున్న పోలీసు నిఘా

కూతురు, అల్లుడితో కలిసి ఉంటుందో వృద్ధురాలు.. ఉదయాన్నే విధులకు వెళ్లిన కూతురు, అల్లుడు వచ్చే వరకు ఇంటి గుమ్మం ముందు కూర్చుని భగవద్గీత చదువుకుంటోంది. ఆమె నగలపై కన్నేశాడో అగంతకుడు.

వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని చూశాడు. కాలనీలో జన సంచారం కూడా లేదు. ఇదే అదనుగా వృద్ధురాలిపై దాడి చేసి ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. కేకలు వేయడంతో ఆమె తలను బండకేసి బాది హతమార్చాడు.

ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు నగలు దోచుకుని ఉడాయించాడు. ఇదంతా చూస్తే ఏదో సినిమా కథలాగే ఉంది కదూ! అయితే ఇది కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో జరిగింది.

కామారెడ్డి క్రైం: ఈ ఘటన జిల్లా కేంద్రానికి సమీపం లోని దేవునిపల్లి జీపీ పరిధిలో గల సాయిసద్గురు కాలనీలో ఏడాది క్రితం జరిగింది. దీంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. బంగారు నగల కోసం ఒంటరిగా కనిపించిన వృద్ధురాలిని దారుణంగా చంపడం అప్పట్లో జనాన్ని భయాందోళనలకు గురిచేసింది. చోరీల నివారణ కోసం పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దోపిడీలు, చోరీల నివార ణ కోసం పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు అంతం తమాత్రంగానే ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు. పోలీసు నిఘా మరింత పెంచాల్సిన అవపసరం ఉంది.  
ఆభరణాల కోసం భౌతిక దాడులు..  
జిల్లాలో చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లతో పాటు ఒంటరిగా కనిపించిన మహిళలపై దుండగులు ఏకంగా భౌతికదాడులకు దిగుతుండటం కలవరపెడుతోంది. దోపిడీలకు పాల్పడేందుకు ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు.

మూడు రోజుల క్రితం జిల్లాలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన మహిళ ఏనుగు అనసూయ తన పొలంలో పనులు చేసుకుంటుండగా భార్యాభర్తలమని చెప్పి మాటలు కలిపిన దుండగులు ఆమెను చితకబాది మెడలోని గొలుసు లాక్కుని ఉడాయించిన విషయం తెలిసిందే.

గత మార్చి 9న దేవునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉండే ఓ మహిళపై ఇదే తరహాలో ఇద్దరు దుండగులు దాడి చేశారు. రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లో ఉండే వైద్య కల్పన మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కుని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది.

అప్పటికే ఆమెను గమనిస్తున్న దుండగులు ఇంటిముందే దాడి చేశారు. ఆమెను, అడ్డొచ్చిన ఆమె భర్తను చితకబాది కల్పన మెడలోంచి 3 తులాల గొలుసు దోచుకుని పరారయ్యారు. ఈ దాడిలో భార్యాభర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. 
ఇతర రాష్ట్రాల మూఠాల పనే..  
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న చోరీలను పరిశీలిస్తే ఇక్కడి ప్రాంతానికి చెందిన పాతనేరస్తులతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాలకు చెందిన దుండగుల ముఠాలు సైతం తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా గతంలో రుజువైంది. బీహార్, మహారాష్ట్ర, హర్యానా, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ముఠాలు గతంలో జిల్లాలో భారీ దోపిడీలకు పాల్పడి పట్టుబడ్డాయి.

ఇటీవలే జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ చేసిన ముఠా కర్ణాటక రాష్ట్రంలోని బాల్కి ప్రాంతానికి చెందినది. ప్రతి వేసవిలో మహారాష్ట్ర ముఠాలు చోరీల్లో ఆరితేరి ఉమ్మడి జిల్లాను టార్గెట్‌ చేయడం చూస్తూనే ఉన్నాం. దుండగులను గుర్తించడంతో పాటు చోరీల నివారణ కోసం చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వేసవిలో చోరీలు, దోపిడీల నివారణ కోసం పోలీస్‌శాఖ మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

తాళం వేసి వెళితే అంతే సంగతి.. 
పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటూ ఇళ్లకు తాళం వేసి వెళితే ఇక అంతే సంగతి. తాళం వేసి ఉన్న ఇండ్లకు గ్యారెంటీ లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేసవి ప్రారంభం నుంచే వరుస చోరీలు వెలుగుచూస్తున్నాయి. పగలు గస్తీ తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తూ పోలీసుల కళ్లుగప్పి రాత్రివేళలో దుండగులు తమ పని కానిస్తున్నారు.

ప్రతి రెండు రోజులకో ఘటన వెలుగు చూస్తూనే ఉంది. చోరీల నివారణ కోసం ప్రతిఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా పోలీసులు గ్రామాలు, కాలనీల్లో సమావేశాలు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు. అన్నిచోట్లా పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు జరగాలంటే అది ఇప్పట్లో జరిగేపని కాదు. ఈ నేపథ్యంలో చోరీల నివారణకు పోలీసుశాఖ మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి.

లక్ష్మీదేవునిపల్లి వద్ద జరిగిన దోపిడీ ఘటనలో అనుమానితులు(ఫైల్‌)   

మరిన్ని వార్తలు