వణికిస్తున్న వదంతులు

22 May, 2018 09:06 IST|Sakshi
తాండూరు ఠాణాలో కర్ణాటక యువకులు

కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో అర్ధరాత్రి అలజడి

పార్థీ ముఠా, కిడ్నాపింగ్‌ గ్యాంగులు తిరుగుతున్నాయని పుకార్లు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన పాత వీడియోలు, ఫొటోలు

భయంభయంగా గడుపుతున్న ప్రజలు

తాండూరు, బషీరాబాద్‌(రంగారెడ్డి) : కర్ణాటక సరిహద్దు మండలం బషీరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి అలజడి రేగింది. కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వదంతులతో పల్లెలు వణికి పోతున్నాయి. దావానలంలా వ్యాపించిన నేరస్తుల పాత వీడియోలు, ఫొటోలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉక్కపోతతో ఇన్ని రోజులు ఆరుబయట పడుకున్న పల్లె జనం వదంతుల భయంతో గుంపులుగా గుమిగూడి జాగారం చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా, బీదర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తుల ముఠాలు రాత్రి వేళల్లో గ్రామాల్లో సంచరిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. పిల్లలను, వృద్ధులను కిడ్నాప్‌ చేసి చంపేస్తున్నారనే పుకార్లు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో గుల్బర్గా జిల్లా సరిహద్దులోని నావంద్గి, ఇందర్‌చెడ్, క్యాద్గిర, ఎక్మాయి, మంతన్‌గౌడ్, మైల్వార్, కంసాన్‌పల్లి, నీళ్లపల్లి, జలాల్‌పూర్, మంతట్టిలో ప్రజలు నిద్ర కూడా పోవడం లేదు.

నావంద్గిలో ఆదివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు సంచరించారనే అనుమానంతో గ్రామస్తులు రాత్రంతా గాలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి ధైర్యం చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఫొటోలు నమ్మవద్దని, అవన్నీ ఫేక్‌ అని వివరించారు. వాట్సప్‌ గ్రూపుల్లో అలాంటివి వస్తే షేర్‌ చేయొద్దని సూచించారు. నీళ్లపల్లి గ్రామస్తులు అర్ధరాత్రి సర్పంచ్‌ ఉమాసుధాకర్‌రెడ్డి ఇంటి వద్ద గుమిగూడి, పోలీసులను పిలిపించాలని విన్నవించారు.

అగ్గనూరులో అనుమానిత వ్యక్తిపై దాడి

యాలాల (వికారాబాద్‌) : చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడని భావిస్తూ ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని అగ్గనూరులో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు.

ఇతని కదలికలు, వ్యవహారంపై అనుమానం వచ్చిన కొంతమంది అతన్ని పట్టుకుని వివరాలు అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భయం వద్దు

తాండూరులో చిన్నారులను అపహరించే ముఠా సంచరిస్తోందంటూ వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. ప్రజలు భయపడాల్సిన పని లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు, ఫొటోలను నమ్మవద్దు. కావాలనే కొందరు ప్రజలను భయబ్రాంతులను గురి చేసేందుకు ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా చిన్నపిల్లల కిడ్నాప్‌ కేసులు నమోదు కాలేదు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం. ఉపాధి కోసం వచ్చే అమాయకులపై దాడులు చేయొద్దు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి.   – రామచంద్రుడు, డీఎస్పీ, సెల్‌: 94406 27353  

మరిన్ని వార్తలు