నేర నిరూపణలో పోలీసుల వైఫల్యం

9 Dec, 2017 08:19 IST|Sakshi

నగరంలో శిక్షలు పడుతున్న కేసులు 38 శాతమే...

సంచలనాత్మక కేసుల్లోనూ రుజువు కాని నేరం

‘మానవబాంబు’ కేసు సైతం కోర్టులో వీగిన వైనం

సిబ్బంది కొరత, ఎదురుతిరుగుతున్న సాక్షులతో సమస్యలు

చక్కదిద్దే చర్యలు ప్రారంభించిన నగర పోలీసులు

నగరంలో వివిధ నేరాలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో నిలవట్లేదు. సరైన సాక్ష్యాధారాలు లేక అతి ముఖ్యమైన కేసులూ వీగిపోతున్నాయి. కేవలం 38.9 శాతం కేసుల్లోనే దోషులకు శిక్ష పడుతోందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం.  ఏదైనా ఓ నేరానికి సంబంధించి నిందితుల్ని పట్టుకోవడమే కాదు... వారిని న్యాయస్థానంలో దోషులుగా నిరూపిస్తేనే బాధితులకు పూర్తి న్యాయం జరిగినట్లు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ కోణంలో పోలీసులు విఫలం అవుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. 

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో (ఉమ్మడి) నమోదైన తొలి మానవబాంబు కేసు.. దాడి జరిగింది సాక్షాత్తూ నగర కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై. ఈ ఘాతుకంలో పెనుముప్పు తప్పినప్పటికీ ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తు, విచారణ దాదాపు పుష్కరకాలం సాగింది. చివరకు కొన్నాళ్ల క్రితం కేసు న్యాయస్థానంలో వీగిపోయింది. ఈ ఒక్క కేసే కాదు.. పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేస్తున్న వాటిలో కనీసం సగం కేసులు కూడా కోర్టులో నిలవట్లేదు. నగరంలో నమోదవుతున్న కేసుల్లో శిక్ష పడుతున్నది కేవలం 38.9 శాతం మాత్రమేనని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) స్పష్టం చేసింది. దేశంలోని ఇతర మెట్రోల కంటే ఈ విషయంలో సిటీ వెనుకబడి ఉందనడానికి ఈ గణాంకాలే ఓ ఉదాహరణ. ఏదైనా ఓ నేరంలో నిందితులను పట్టుకోవడమే కాదు.. వారిని న్యాయస్థానంలో దోషులుగా నిరూపిస్తేనే బాధితులకు పూర్తి న్యాయం జరిగినట్లు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ కోణంలో పోలీసులు విఫలమవుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. 

సిబ్బంది కొరతతోనూ ఇబ్బందే..
నేరం నిరూపణలో 2016 ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలోనూ కన్వెక్షన్స్‌ 45.1 శాతంగా నమోదయ్యాయి. ఈ పరిస్థితులకు అనేక కారణాలు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. పోలీసు విభాగంలో క్షేత్రస్థాయి అధికారులైన ఇన్‌స్పెక్టర్, ఎస్సైల కొరత తీవ్రంగా ఉంది. అత్యధిక కేసుల్లో దర్యాప్తు అధికారులుగా వీరే ఉంటారు. ప్రమాణాల ప్రకారం ఒక్కో దర్యాప్తు అధికారి ఏడాదికి గరిష్టంగా 60 నుంచి 80 కేసుల్ని మాత్రమే దర్యాప్తు చేయాలి. సిబ్బంది కొరత వల్ల ఒక్కొక్కరు 300 నుంచి 400 కేసులు దర్యాప్తు చేయాల్సి వస్తోంది. ఈ ప్రభావం కేసులపై పడి దర్యాప్తులో నాణ్యత దెబ్బతింటోంది.  

సాంకేతిక కారణాలు, సాక్షులతోనూ..
అనేక కారణాల నేపథ్యంలో కేసును కొలిక్కి తీసుకువకావడంపై ఉంటున్న శ్రద్ధ సాక్ష్యాధారాల సేకరణపై ఉండట్లేదు. రోటీన్‌లో భాగంగా సేకరిస్తున్న వాటి విషయంలోనూ సాంకేతిక, నిబంధనల్ని దర్యాప్తు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆధారాలను న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవట్లేదు. వీటన్నింటికీ మించి బాధితులు, సాక్షులతోనూ అధికారులు ఇబ్బందులు వస్తున్నాయి. ఆవేశం నేపథ్యంలో ఫిర్యాదు సమయంలో చూపిన ఆసక్తి బాధితులు కేసు విచారణలో చూపించట్లేదు. వీలున్నంత వరకు రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నారు. మరోపక్క ఆయా కేసుల్లో సాక్షులు కేసు విచారణ సమయంలో ఎదురు తిరగడం సైతం ఇబ్బందికరంగా మారుతోంది. ఇవన్నీ న్యాయస్థానాల్లో కేసులు వీగిపోవడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. వీటితో పాటు పోలీసులకు ఎప్పటికప్పుడు పునశ్ఛరణ తరగతులు నిర్వహించకపోవడం సైతం దర్యాప్తు నాణ్యతపై ప్రభావం చూపుతోంది. 

దర్యాప్తు విధానాల్లోనూ లోపాలు
పోలీసు దర్యాప్తు విధానాల్లో ఉన్న అనేక లోపాలు కేసుల విచారణపై ప్రభావం చూపుతోంది. పాశ్చాత్య దేశాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదితర సంస్థలు చేసే ఇన్వెస్టిగేషన్స్‌ పక్కాగా ఉంటాయి. ఓ నేరం జరిగినప్పుడు ప్రాథమికంగా వీరు నిందితుల కంటే ఆధారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరి దర్యాప్తు విధానం ‘ఎవిడెన్స్‌ టు అక్యూజ్డ్‌’ పం«థాలో సాగుతుంది. సీజర్, పంచ్‌ విట్నెస్‌ తదితర అంశాల్లోనూ పక్కాగా మాన్యువల్‌ను అనుసరిస్తారు. అయితే స్థానిక పోలీసుల దర్యాప్తు విధానం ‘అక్యూజ్డ్‌ టు ఎవిడెన్స్‌’ పంథాలో సాగుతుంది. తొలుత నిందితుడిని పట్టుకున్న తర్వాత నేరానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంటారు.

దిద్దుబాటు చర్యలతో ఫలితాలు
నగరంలో నేర నిరూపణకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు చేపట్టారు. దర్యాప్తు అధికారులపై కేసుల భారం తగ్గించేందుకు అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ (యూఐ) కేసు మేళాలు నిర్వహిస్తున్నారు. నేరం జరిగినప్పుడు ఆధారాల సేకరణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. క్రైమ్‌ ప్రివెన్షన్, డిటెక్షన్‌తో పాటు కన్వెక్షన్‌లోనూ సీసీ కెమెరాల ఫీడ్‌ను ఆధారంగా వాడుకుంటున్నారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, విచారణ పూర్తయ్యే వరకు బాధితులు, సాక్షులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు కోర్టు వ్యవహారాల పర్యవేక్షణకు కోర్టు మానిటరింగ్‌ సెల్‌ (సీఎంఎస్‌) పేరుతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. క్లూస్‌ టీమ్స్‌ సంఖ్య పెంచడం, నాణ్యమైన పరికరాలు అందిచడంతో పాటు సిబ్బందికి అనునిత్యం శిక్షణ ఇస్తున్నారు. ఈ చర్యలతో క్రమక్రమంగా శిక్షల శాతం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు