కత్తి దూశాడు.. కాల్చి చంపారు

3 May, 2019 08:13 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: నేరాలు, ఘోరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ రౌడీషీటర్‌ పాపం పండింది. ప్రజలపైనేగాక పోలీసులపై కూడా కత్తిదూయడంతో అతడి ప్రాణాన్ని తుపాకీ తూటలు బలితీసుకున్నాయి. వివరాలు. సేలం జిల్లాలో ఇటీవల కాలంలో రౌడీయిజం పెరిగిపోయిందని, రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయని పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లాలోని రౌడీల జాబితాను తయారుచేసుకుని వారి కదలికలపై నిఘాపెట్టారు. ఈ దశలో సేలం జిల్లా మేట్టుపట్టి దేవాంగర్‌కాలనీకి చెందిన కదిర్‌వేల్‌ (25) పోలీసుల దృష్టిలో పడ్డాడు. 2006లో కదిర్‌వేల్‌ ఒకతడిని హత్య చేయడంతో తొలిసారిగా పోలీసుల రికార్డులకు ఎక్కాడు. ఆ సంఘటన తరువాత అనేక దౌర్జన్యాలు కొనసాగించడంతో కదిర్‌వేల్‌ను రౌడీషీటర్‌ జాబితాలో చేర్చారు.

ఆరునెలల క్రితం మరోవ్యక్తిని కదిర్‌వేల్‌ హత్యచేసి పారిపోయాడు. దీంతో పోలీసులు గాలిస్తున్న నేరస్థుల జాబితాలో చేర్చారు. అతడు హత్య, హత్యాయత్నం, దారిదోపిడీ తదితర 20 క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నాడు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం పరిపాటిగా మారడంతో శాంతి భద్రతల సమస్యలు నెలకొన్నాయి.  ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన వ్యాపారి గణేశన్‌ 10 రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసుతో కదిర్‌వేల్‌కు సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కదిర్‌వేల్‌ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలిస్తూ సేలం మిన్నాంపల్లి సమీపం కుళ్లంపట్టి జంక్షన్‌ వంతెన సమీపంలో దాక్కుని ఉన్నట్లు కనుగొన్నారు.

గురువారం ఉదయం సీఐ సుబ్రమణి, సబ్‌ ఇన్స్‌పెక్టర్లు మారి, పెరియస్వామి అతడిని చుట్టుముట్టగా తన వద్దనున్న కత్తితో బెదిరించి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే అతడితో పోలీసులు పెనుగులాట చోటుచేసుకుంది. ఈ దశలో కదిర్‌వేల్‌ కత్తితో దాడికి దిగడంతో పోలీసులకు గాయాలయ్యాయి. ఇదే అదనుగా అతడు పరుగులు పెట్టడంతో సీఐ సుబ్రమణి తన వద్దనున్న తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో రౌడీ కదిర్‌వేల్‌ తూటాల ధాటికి నేలకొరిగి ప్రాణాలు విడిచాడు. అతడితోపాటూ ఉండిన ముగ్గురు అనుచర రౌడీలు పారిపోయారు. కదిర్‌వేల్‌ కత్తిపోట్లతో గాయపడిన పోలీసులు సేలం ఆçస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. సేలం జిల్లాలో ఎంతోకాలంగా అనేక అరాచకాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్‌ కదిర్‌వేల్‌ ఎన్‌కౌంటర్‌లో హతం కావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు