ఉలిక్కిపడ్డ బెట్టింగ్‌ రాయుళ్లు

13 Jul, 2019 06:45 IST|Sakshi

సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : రాజాం పట్టణ కేంద్రంగా సాగుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్థానిక బాబానగర్‌ కాలనీలో ఓ అద్దె ఇంటి నుంచి కొనసాగిస్తున్న బెట్టింగ్‌ ముఠాను రాజాం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2.65 లక్షలు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరడంతో మరో ఐదుగురు బుకీలు అక్కడ్నుంచి తప్పించుకుని పరారయ్యారు.

ఈ నెల 7న వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ –2 సందర్భంగా వీరంతా మ్యాచ్‌ తిలకిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు. రాజాంలో కొంతకాలంగా సాగుతున్న బెట్టింగ్‌రాయుళ్లుపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో బుకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి లక్షలాది రూపాయలు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారినట్లు సమాచారం. ఇటువంటి బెట్టింగ్‌ రాయుళ్లుపై పోలీసుల మరింత కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది. 

క్రికెట్‌ బెట్టింగ్‌పై నిఘా : ఎస్పీ
ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడినా, జూదం ఆడుతున్నా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం బెట్టింగ్‌ ముఠా వివరాలను వెల్లడించారు. రాజాం పట్టణ సీఐ సోమశేఖర్‌కు వచ్చిన సమాచారంతో నిఘా పెట్టి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ. 2.65 లక్షలు, 12 సెల్‌ఫోన్లు, పద్దు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో పిన్నింటి శివకుమార్, శేషపు మురళీకృష్ణ, లెంక దామోదరరావు, చింత శ్రీనివాసరావు, కరణం పురుషోత్తం ఉన్నారని వివరించారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ ప్రేమ్‌కాజల్, సీఐ సోమశేఖర్, ఎస్‌ఐ సూర్యకుమారి, హెచ్‌సీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు