పోలీసుల సోదాలతో కలకలం

23 Jan, 2019 13:11 IST|Sakshi
పోలీసులు పట్టుకున్న రికార్డులు లేని వాహనాలు

గంటావూరులో రికార్డులు లేని         77 బైక్‌లు సీజ్‌

పలమనేరు: పట్టణంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీ మంగళవారం వేకువజామున పోలీసుల సోదాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వందమంది పోలీసులు, పోలీసు వాహనాలు, హంగామా చూసి ఒక్కసారిగా నిద్రమత్తులోంచి జనం తేరుకున్నారు. వేకువజాము నుంచి ఉదయం 10 గంటలదాకా ఇంటింటా పోలీసులు సోదాలు చేశారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ యుగంధర్‌బాబు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. పలమనేరు సబ్‌ డివిజన్‌ పోలీసు పరిధిలోని నలుగురు సీఐలు, 12మంది ఎస్‌ఐలు, 90మంది సిబ్బంది పాల్గొన్నారు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. గంటావూరు ఇందిరమ్మ కాలనీలో 4వేలదాకా నివాసాలున్నాయి. బయటి ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా కాలనీలోకి చేరారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్నవారి వివరాలు పెద్దగా ఎవరికీ తెలియదు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్న పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆధార్, రేషన్‌ కార్డు మొదలైన వాటి వివరాలు సేకరించారు. వారు వినియోగిస్తున్న మోటార్‌ సైకిళ్ల లైసెన్సు రికార్డులను పరిశీలించారు. 77 బైకులకు రికార్డులు లేకపోవడంతో వాటిని స్టేషన్‌కు తరలించారు.  ప్రస్తుతం పట్టణంలో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని వార్తలు