కాలుష్యానికి కళ్లెం ఏదీ?

24 Feb, 2020 11:07 IST|Sakshi

ప్రేక్షక పాత్రలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు

పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో విఫలం

సాక్షి, సిటీబ్యూరో: కాలుష్య కారకపరిశ్రమలను కట్టడి చేయడంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రేక్షక పాత్రకేపరిమితం అవుతోంది. పర్యావరణపరిరక్షణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినప్పటికీ..చాలా విషయాల్లో వెనుకంజ వేస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. పర్యావరణ పరిరక్షణ చట్టాలను అమలు చేయడం, చట్టాలు ఉల్లంఘించిన వారికి శిక్షలు విధించేవిషయంలో చేష్టలుడిగి చూస్తోందని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి, నీటి కాలుష్య నివారణ చట్టాల అమలుకు..పీసీబీని ఏర్పాటు చేసినప్పటికీ సంబంధితవిషయ పరిజ్ఞానం ఉన్న వారిని కీలకపదవుల్లో నియమించకపోవడంతోఆయా చట్టాలు కాగితాలకే పరిమితంఅవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ప్రధానంగా నీటి కాలుష్య నివారణచట్టం సెక్షన్‌– 4, గాలి కాలుష్య నివారణ చట్టం–సెక్షన్‌ 5 ప్రకారం పీసీబీ అధ్యక్షులకు..పర్యావరణంపై పూర్తి అవగాహన, చట్టాలు ఉల్లంఘించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై అపారమైన అనుభవం ఉండాలని పీసీబీ చట్టం పేర్కొంటోంది. కానీ ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు.

అలాగే సంస్థ సభ్యకార్యదర్శికి అన్ని అంశాలపై విషయ పరిజ్ఞానం, అపార అనుభవం, శాస్త్రీయ, సాంకేతిక, పరిపాలన అనుభవం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తోంది. కానీ ఈ నిబంధనలకు పక్కనపెట్టి సంబంధిత అంశాలపై అనుభవం లేని వారిని కీలక పదవుల్లో నియమిస్తుండటంతో పీసీబీ నిర్వీర్యం అయ్యిందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. 2001లో కోయంబత్తూర్‌లో జరిగిన పీసీబీ సమావేశంలో సంస్థ పనితీరు మెరుగుపరిచేందుకు నిపుణులు చేసిన సూచనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2005లో జారీచేసిన మార్గదర్శకాలు కూడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం పీసీబీ అధ్యక్షులుగా.. విశ్రాంత ప్రధాన కార్యదర్శిని నియమించడం శోచనీయమని ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆక్షేపించారు. ఇతర సభ్యుల నియామకంలోనూ ఇలాంటి పొరపాట్లు చేయడంతో పీసీబీ విశ్రాంత అధికారులకు పునరావాస కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. 2017లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పీసీబీలో పర్యావరణ అంశాలపై పట్టున్న వారినే నియమించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థలో అవసరమైనంత మంది ఇంజనీర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పలు పరిశ్రమలు ఇష్టారాజ్యంగా కాలుష్యానికి పాల్పడుతూ గాలి, నీరు, నేలను కలుషితం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సరళీకృత విధానంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు జారీ చేస్తుండడంతో వందలాదిగా నూతన పరిశ్రమలు ఏర్పాటవుతున్నప్పటికీ... కాలుష్య నివారణకు అవసరమైన నిఘా లేకపోవడం శోచనీయమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తుండటం గమనార్హం.

గ్రేటర్‌లో రోజురోజుకూ పెరుగుతోన్న కాలుష్యం..
వాయుకాలుష్యం: నగరంలో వాహనాల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. ఇందులో కాలంచెల్లిన వాహనాలు సుమారు 15 లక్షల వరకు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న పొగలో పలు ప్రమాదకర వాయువులున్నాయి. మరోవైపు పరిశ్రమలు వెదజల్లుతోన్న వాయుకాలుష్యంతో సిటీజన్లకు స్వచ్ఛమైన ప్రాణవాయువు దూరమవుతోంది.
జలాశయాల కాలుష్యం: నగరంలో సుమారు 185 చెరువులుండగా..ఇందులో 100 చెరువులు ఆర్గానిక్‌ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి నిత్యం వెలువడుతోన్న కాలుష్య ఉద్ఘారాలు ఆయా జలాశయాల్లో చేరి పర్యావరణం హననం అవుతోంది.
నేల కాలుష్యం: బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్, తోలు, లెడ్, బ్యాటరీ కంపెనీల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో నేల కలుషితమవుతోంది.

కాలుష్య పరిశ్రమల ఆగడాలిలా..
ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి.  
ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిబుల్‌ ఎఫెక్టివ్‌ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్‌ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం.
గాఢత అధికంగా ఉన్న వ్యర్థజలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు.
ఆయా పరిశ్రమల్లో వెలువడే  ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్‌ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి.  
ఘన,ద్రవ వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
ప్రధానంగా  మల్లాపూర్,ఉప్పల్,కాటేదాన్,కుత్భుల్లాపూర్,జీడిమెట్ల, దుండిగల్, పటాన్‌చెరు, పాశమైలారం, బొంతపల్లితదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు.  
మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రముల్లో నింపి శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్‌ చేస్తున్నారు. ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు.
ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబోస్తున్నారు. అక్రమ వ్యవహారం బయటికి కనిపించకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరూ అటు వైపు రాకుండా 24 గంటల పాటు భద్రతా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం.
వ్యర్థాల డంపింగ్‌తో  కుత్భుల్లాపూర్,జీడిమెట్ల, బొల్లారం తదితర పారిశ్రామివాడలు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా కలుషితమయ్యాయి.  
ఆయా ప్రాంతాల్లో గతంలో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో ప్రయోగించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భారలోహలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది.

మరిన్ని వార్తలు