పథకం వేసి.. ప్రాణం తీసి

3 Apr, 2018 13:00 IST|Sakshi
..వివరాలు వెల్లడిస్తున్న సీఐ అబ్బయ్య 

దమ్మపేట: మండలంలోని అంకంపాలెం శివారు ఆర్లపెంట సమీపంలోని అడవుల్లో ఒకచోట ఎప్పటివో పెద్ద పెద్ద పైపులు. వాటిలో ఒకదానిలో ఓ యువకుడి మృతదేహం. గత నెల 29న అతడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు వెళ్లారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అతడిని, సత్తుపల్లి మండలం గాంధీనగరం గ్రామస్తుడైన ఆటో డ్రైవర్‌ బైట శివ(28)గా గుర్తించారు. దర్యాప్తు చేపట్టారు. మిస్టరీని ఛేదించారు. వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో అశ్వారావుపేట సీఐ ఎం.అబ్బయ్య ఇలా వివరించారు. 

సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు గాంధీనగరం గ్రామానికి చెందిన బైట శివ, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యతో శివకు వివాహేతర సంబంధం ఉన్నదని ములకలపల్లి మండలంలోని దారావారిగుంపు గ్రామస్తుడైన బండారు నగేష్‌ అనుమానించాడు. దీనిని తీవ్రంగా పరిగణించాడు. శివను ఎలాగైనా చంపాలని నగేష్‌ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన వదిన కీసరి పున్నమ్మతో చెప్పాడు. తన మిత్రుడైన కొర్రి రామకృష్ణకు కూడా చెప్పాడు. సహకరించాలని కోరాడు. వారిద్దరూ అంగీకరించారు. ముగ్గురూ కలిసి పథకం వేశారు. 

ఈ పథకంలో భాగంగా, శివతో పున్న మ్మ మూడు రోజులపాటు ఫోన్‌ సంభాషణ సాగించింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నీతో మాట్లాడాలని ఉంది’ అని నమ్మించింది. శివ పూర్తిగా నమ్మాడు. ‘ఎక్కడ కలుసుకుందాం..?’ అని ఆమె అడిగింది. గత నెల 27వ తేదీన శివకు ఫోన్‌ చేసింది. తాను ఆర్లపెంట శివారులోని వినాయకపురం రోడ్డు వద్దనున్న ఇందిరాసాగర్‌ పాత పైపుల వద్దకు (అదే రోజు) రాత్రి వేళ వస్తానని, అక్కడ కలుసుకుందామని చెప్పింది. అతడు సరేనన్నాడు. 

ఈ విషయాన్ని బండారు నగేష్, తన మిత్రుడైన కొర్రి రామకృష్ణకు చెప్పాడు. నగేష్, పున్నమ్మ, రామకృష్ణ కలిసి ఆటోలో సత్తుపల్లి వచ్చారు. చీకటి పడిన తరువాత అక్కడి నుంచి వినాయకపురం రోడ్డు వద్దకు చేరుకున్నారు. తమ ఆటోను చెట్ల పొదల్లో దాచారు. శివ కోసం ఎదుచూస్తున్నారు. 

 రాత్రి వేళ.. చిమ్మ చీకటి. ఇందిరాసాగర్‌ పాత పైపుల వద్దకు శివ వచ్చాడు. పున్నమ్మతో మాట్లాడుతున్నాడు. అప్పటివరకూ ఒకపక్కన దాక్కున్న నగేష్, రామకృష్ణ బయటికొచ్చారు. శివపై ఒక్కసారిగా దాడి చేశారు. ముక్కుపై బలంగా గుద్దారు. అతడి కాళ్లను రామకృష్ణ గట్టిగా పట్టుకోగా, గొంతును నగేష్‌ నులిమి చంపాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకుగాను నోట్లో పురుగు మందు పోశారు. అక్కడి నుంచి ఆ ముగ్గురూ ఆటోలో పారిపోయారు. 

 ఈ సమాచారమందుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.దర్యాప్తు ప్రారంభించారు. అతడిని, ఆటో డ్రైవర్‌ శివగా గుర్తించారు. మండలంలోని పట్వారీగూడెం వద్ద వాహనాలను పోలీసులు సోమవారం తనిఖీ చేస్తున్నారు. అటుగా ఓ ఆటో వచ్చింది. పోలీసులను చూడడంతోనే, అందులోని ముగ్గురు కిందకు దూకి పారిపోతున్నారు.

పోలీసులు వెంబడించి పట్టుకుని గట్టిగా ప్రశ్నించారు. శివను తాము హత్య చేసినట్టుగా చెప్పారు. ఎందుకు, ఎలా చంపిందీ పూసగుచ్చినట్టుగా వివరించారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టుకు అప్పగించారు. సమావేశంలో ఎస్‌ఐ జలకం ప్రవీణ్, ఏఎస్‌ఐ సుబ్బారావు, హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌ చౌదరి, కానిస్టేబుల్‌ శివరామకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు