కోట్లలో మోసం : రాహుల్‌ ద్రవిడ్‌ ఫిర్యాదు

19 Mar, 2018 17:43 IST|Sakshi
రాహుల్‌ ద్రవిడ్‌ (ఫైల్‌ ఫోటో)

బెంగళూరు : బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ పోంజి సంస్థ, పలువురు సెలబ్రిటీలను కోట్లలో మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ పోంజి సంస్థ మోసం చేసిన బాధితుల్లో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ లెజెండ ప్రకాశ్ పదుకొణె, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, మాజీ కర్ణాటక క్రికెటర్ అవినాష్ వైద్య తదితరులు ఉన్నారు. తాజాగా ఈ పోంజి సంస్థకు వ్యతిరేకంగా భారత క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పోలీసు ఫిర్యాదు దాఖలు చేశాడు. 

తన ఫిర్యాదులో విక్రమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే కంపెనీలో ఎక్కువ రిటర్నులు వస్తాయనే ఆశతో రూ.20 కోట్లను పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిపారు. కానీ అసలు కాకపోగా, దాని కంటే తక్కువగా కేవలం రూ.16 కోట్ల మాత్రమే వెనక్కి వచ్చినట్టు పేర్కొన్నారు. తాను పెట్టిన పెట్టుబడుల మేరకు ఇంకా కంపెనీ తనకు రూ.4 కోట్లు బాకీ ఉందని చెప్పారు. ఇందిరానగర్‌ పోలీసు స్టేషన్‌లో క్రికెట్‌ లెజెండ్‌ తన ఫిర్యాదును దాఖలు చేశాడు. ఈ ఫిర్యాదును ఈ ఘరానా మోసం కేసును విచారిస్తున్న బనశంకరీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ స్కాం రూ.500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 

అంతకముందే విక్రమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే కంపెనీ యజమాని రఘవేంద్ర శ్రీనాథ్‌ని అతని ఏజెంట్లు సుత్రం సురేష్‌, నరసింహమూర్తి, కేజీ నాగరాజు, ప్రహ్లాద్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆశ్చర్యకరంగా  సురేష్‌ అనే నిందితుడు బెంగళూరులో ప్రముఖ స్పోర్ట్స్‌ జర్నలిస్టు. తనకు పరిచయం ఉన్న క్రీడాకారులతో ఈ మోసపూరిత కంపెనీలో పెట్టుబడి పెట్టేలా వారిని నమ్మించడంలో కీలకపాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు. వీరిని 14 రోజుల పోలీసు కస్టడీకి పంపించారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు ఓ పోలీసు ఆఫీసర్‌ చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు, ఈ పోంజి స్కాంలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల పేర్లను బహిర్గతం చేశారు. వారి బ్యాంకు అకౌంట్లను కూడా  అధికారులు తనిఖీ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు