వీడిన మిస్టరీ

3 Apr, 2018 12:49 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ పాలరాజు

రియల్టర్‌పై హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన    ఎస్పీ పాలరాజు

విజయనగరం టౌన్‌: జిల్లా కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు బొత్స మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పోలీసులు స్వల్ప కాలంలోనే కేసును ఛేదించారు. ఈ సంఘటనలో మోహన్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉపయోగించిన గన్‌ను తగరపువలస వద్దనున్న గోస్తనీ నదిలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ జి. పాలరాజు సోమవారం విలేకరుల ముందుకు తీసుకువచ్చి వివరాలు వెల్లడించారు. గత నెల 24వ తేదీ రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌  కార్యాలయంలో నమ్మి పైడిరాజు అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై నిందితుడు బొత్స మోహన్‌  గన్‌తో కాల్పులు జరిపాడు.  అనంతరం అక్కడ నుంచి పరారై గన్‌ను గోస్తనీ నదిలో పడేశాడు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్‌ యంత్రాంగం సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు మోహన్‌ను పట్టుకుంది. ఆయనతో పాటు తుపాకీ కొనుగోలుకు సహకరించిన కర్రోతు వెంకటరమణమూర్తి అలియాస్‌ రమేష్‌ను,  సంఘటనా స్థలంలో కాల్పులు జరిపినప్పుడు కాపలాదారుగా వ్యవహరించడంతో పాటు కాల్పుల తర్వాత  మోహన్‌ను నేరస్థలం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆశాన వెంకటరమణను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి రంగు సురేష్‌తో పాటు ఒడిశాకు చెందిన మరొకరు పరారీలో ఉన్నారు.  

కాల్పులకు కారణాలివే..
రియల్టర్‌ నమ్మి అప్పలరాజు, అతని మామయ్య ఉల్లంకుల శ్రీనివాసరావు కొన్నేళ్లుగా పట్టణంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా నిందితుడు మోహన్‌ నుంచి రూ.16 లక్షలను 2014లో అడ్వాన్స్‌గా తీసుకున్నారు. అందుకు ప్రతిగా మండలంలోని వీటీ అగ్రహారంలో 55 చదరపు గజాల స్థలాన్ని గాని.. లేనిపక్షంలో ఏడాదిలో మోహన్‌ ఇచ్చిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము (రూ.32 లక్షలు) ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.  అయితే అప్పలరాజు ఏడాదిలో అటు సొమ్ము ఇవ్వడంలో గాని, ఇటు స్థలం రిజిస్ట్రేషన్‌ చేయడంలో గాని విఫలమవ్వడంతో అప్పలరాజు, మోహన్‌ మధ్య అంతరం ఏర్పడింది. దీంతో ఇరువురి మధ్య ఎప్పటికప్పుడు వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మోహన్‌ ఈ విషయాన్ని కొంతమంది పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లడంతో గుండాలపేటలో ఉన్న 650 చదరపు గజాల స్థలాన్ని మోహన్‌ పేరుమీద అప్పలరాజు రిజిస్ట్రేషన్‌ చేశాడు.

అయితే హైవే రోడ్డు విస్తరణలో భాగంగా  వంద గజాల స్థలం పోనుండడంతో మోహన్‌ నిరాశకు గురయ్యాడు. ఇందులో భాగంగా అప్పలరాజుపై అక్కసు పెంచుకున్నాడు. తనకు జరిగిన నష్టానికి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో  కర్రోతు రమణమూర్తి అలియాస్‌ రమేష్‌ సహకారంతో రంగు రమేష్‌ ద్వారా తుపా కీ కొనుగోలు చేసే  ప్రాం తాన్ని తెలుసుకుని ఒడిశా వాసి నుంచి తుపా కి, ఐదు రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేశా డు. పథకం ప్రకారం ఆశాన వెంకటరమణ సాయంతో  బాధితుడు అప్పలరాజు ఆఫీస్‌కు వెళ్లి మోహ న్‌ ఐదురౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. తుపాకీనీ తగరపు వలస గోస్తనీనదీలో పడేశాడు.  గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలు, సెల్‌ఫోన్‌ వినియోగంపై పోలీసులు దృష్టి సారించి నిందితుడితో పాటు మరో ఇద్దరిని తగరపువలస పరిసర ప్రాంతా ల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇది లా ఉంటే బాధితుడు నమ్మి అప్పలరాజు  విశాఖలో కేర్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సమావేశంలో ఏఎస్పీ వెంకటరమణ, ఓఎస్‌డీ విక్రాంత్‌పాటిల్, సీసీఎస్‌ డీఎస్పీ ఏఎస్‌ చక్రవర్తి, పట్టణ డీఎస్పీ ఏవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

పోలీసులకు రివార్డులు
కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా పనిచేసిన వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్, ఎస్సైఐలు జీఏవీ రమణ, ఎ.నరేష్, కానిస్టేబుల్‌ డి.శ్రీనివాసరావు,  సీసీఎస్‌ ఎస్సైలు సింహాచలంనాయుడు, రాజారావు, హెచ్‌సీ శంకరరావు, పి.జగన్మోహనరావు, కానిస్టేబుల్‌ నాయుడు, ప్రసాద్, రూరల్‌ ఎస్సై రామకృష్ణ,  టూటౌన్‌ ఎస్సై వి.అశోక్‌ కుమార్, నెల్లిమర్ల ఎస్సై హెచ్‌. ఉపేం ద్ర,  బొబ్బిలి ఎస్సై అమ్మినాయుడు, స్పెషల్‌  బ్రాంచ్‌ సీఐ జి.రామకృష్ణ, ఐటి కోర్‌ కానిస్టేబుల్‌ రవికుమార్, కానిస్టేబుల్‌ రమేష్, పూసపాటిరేగ మండలం  బర్రిపేటకు చెందిన గజ ఈతగాళ్లు బర్రి దారయ్య, పైడిరాజు, గుంటి ఎరకయ్య, మరుపల్లి పారయ్య, సూరాడ చయ్య, ఆకుల రామాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రోత్సాహక, నగదు రివార్డులను  అందజేశారు.

మరిన్ని వార్తలు