ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర

6 Nov, 2023 05:47 IST|Sakshi

కాశీబుగ్గ సామాజిక సాధికార యాత్రలో స్పీకర్‌ తమ్మినేని, మంత్రులు ధర్మాన, సీదిరి 

కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు/సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే సామాజిక సాధికారత సాధ్యమైందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ పాలిస్తున్నారని.. అందుకే తమ పథకాలను చంద్రబాబు కూడా కాపీ కొట్టడానికి తయారైపోయారని వారు ఎద్దేవా చేశారు.

పేదల పక్షాన నిల్చుని పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడం చారిత్రక అవసరమన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కాశీబుగ్గ బస్టాండ్‌ సమీపంలో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వీరు ప్రసంగించారు. 

సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూశారని.. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులతో అనుచితంగా మాట్లాడారని, అలాగే.. నాయీ బ్రాహ్మణులతో కూడా నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చట్టసభలు, కార్పొరేషన్‌ పదవుల్లో సీఎం జగన్‌ పెద్దపీట వేశారని సీదిరి అప్పలరాజు చెప్పారు. గతంలో మన పిల్లల బతుకులు మార్చాలన్న ఆలోచన ఏ నాయకుడికీ రాలేదని, కానీ.. జగన్‌ మాత్రం అమ్మఒడి అందించి పేదల చదువులు ఆగకుండా వారి బతుకుల్లో దీపాలు వెలిగించారని కొనియాడారు.    

అవినీతి మరక లేకుండా ‘సంక్షేమం’ : ధర్మాన 
అనంతరం.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచిని గుర్తుచేసేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఏదైనా కార్యక్రమం తలపెడితే మూడు నాలుగు ప్రభుత్వాలు మారితే గానీ అది కార్యరూపం దాల్చేది కాదని.. కానీ, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక పనుల్లో వేగం కనిపిస్తోందని.. పాలనలో ఆయన కొత్త ఒరవడి సృష్టించారని తెలిపారు. ఉద్యమాలు జరిగితేగానీ జరగని పనులు ప్రస్తుత ప్రభుత్వం సులభంగా చేస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు.

సంక్షేమ పథకాల కింద రూ.రెండు లక్షల ముప్‌పై వేల కోట్లను ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా జమచేశారని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పనితీరుకు ఇది మచ్చుతునక అని ధర్మాన అన్నారు. చంద్రబాబు కూడా ఈ సంక్షేమ పథకాలపై ఎలాంటి అవినీతి ఆరోపణ చేయలేకపోయారన్నారు. బాబు పాలనకు, జగన్‌ పాలనకు మధ్యనున్న తేడాను ప్రజలే బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. బాబు జీవితమంతా తన వారికి దోచి పెట్టడానికి, దోచుకున్నది దాచుకోవడానికే సరిపోయిందని ధర్మాన ఎద్దేవా చేశారు.  

పేదలు తలెత్తుకుని బతికేలా.. 
ఇక మేనిఫెస్టోలో ఇచి్చన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో పేదలు తలెత్తుకుని బతికేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు తన మనవళ్లను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తూ పేదలకు మాత్రం ఆంగ్ల మాధ్యమం వద్దంటూ కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటివి పేద విద్యార్థులకు వరమని ఆయన తెలిపారు.

తన దృష్టిలో ఇద్దరే ఇద్దరు మామలని.. ఒకరు చందమామ అయితే మరొకరు జగన్‌ మామ అని కొనియాడారు. మరోవైపు.. జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించడం సీఎం వైఎస్‌ జగన్‌కు మాత్రమే సాధ్యమన్నారు. ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర అని తమ్మినేని అభివరి్ణంచారు. జగన్‌ బటన్‌ నొక్కితే నేరుగా లబ్ధిదారులకే వెళ్తుందని, మధ్యవర్తిత్వం లేని పాలన అందిస్తున్నారని తెలిపారు.

నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్ని బటన్‌లు నొక్కారో అందుకున్న వారికే తెలుసునన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పాలవలస శ్రీకాంత్, ఎమ్మెల్యేలు కంభాల జోగులు, రెడ్డి శాంతి, విశ్వాసరాయి కళావతి, పలాస మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇసుకేస్తే రాలనంతగా జనం.. 
ఇక ఆదివారం నిర్వహించిన ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. పల్లె ప్రాంతాల నుంచి వెల్లువలా బహిరంగ సభకు తరలివచ్చారు. సభ నిర్వహించిన ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ కేటీ రోడ్డు వరకు బస్సు యాత్ర సాగింది.  

నేడు విశాఖ, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో యాత్ర.. 
ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం విశాఖపట్నం జిల్లా గాజువాక, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో జరుగుతుంది. 

మరిన్ని వార్తలు