మార్చురీలోని మృతదేహం ఎత్తుకెళ్లి..

23 May, 2020 11:12 IST|Sakshi
ఖననం చేసిన బాలుడి మృతదేహాన్ని బయటికి తీసేందుకు తవ్వుతున్న దృశ్యం

ఎవ్వరికీ తెలియకుండా ఖననం చేసిన కుటుంబసభ్యులు

ఆస్పత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు

జూలూరుపాడులో ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం

కొత్తగూడెంరూరల్,జూలురూపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గల జిల్లా ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మార్చురీలో ఉన్న బాలుడి మృతదేహాన్ని వారి బంధువులు ఎవరికీ చెప్పకుండా తీసుకవెళ్లిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. జూలూరుపాడు మండలం బొజ్యాతండాకు చెందిన గుగులోతు రాందాస్‌ కుమారుడు శివ(13) తన సోదరుడితో గురువారం గొడవపడ్డాడు. శివను అన్న మందలించటంతో మనస్తాపానికి గురైన శివ ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు జూలురుపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకువెళ్లగా పరిస్థితి మిషమించటంతో జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు. ఇక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం శివ మృతిచెందాడు. వెంటనే శివ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని విధి నిర్వహణలో ఉన్న డాక్టర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు..
జిల్లా ఆసుపత్రిలో ఉన్న శివ మృతదేహానికి పోస్టుమార్టం కాకుండానే మృతుడి బంధువులు గురువారం రాత్రి ఇంటికి తీసుకెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం శివ మృతదేహం మార్చురీలో లేకపోవడంతో అధికారులు హైరానా పడ్డారు. పోస్టుమార్టం నిర్వహించాల్సిన మృతదేహం మాయం కావడంతో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దీంతో ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్‌ సురేందర్‌ ఈ విషయమై త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో మృతుడికి సంబంధించిన బంధువులెవరూ కన్పించకపోవడంతో వారిని విచారించగా గురువారం రాత్రి వారే మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసినట్లు తెలిసింది. అయితే రాత్రి వేళలో విధులు నిర్వహించే నర్సుల వద్ద మార్చురీ తాళాలు ఉండాల్సి ఉండగా, అవి అటెండర్‌ వద్దకు ఎలా వచ్చాయని, అటెండర్‌ సైతం ఎలా మృతదేహాన్ని బయటకు పంపించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మృతదేహం వెలికి తీయించి పోస్టుమార్టం..
జూలూరుపాడు మండలం బొజ్యాతండాలో సమీపంలో శివ మృతదేహాన్ని శుక్రవారం ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్‌ పర్యవేక్షణలో మృతదేహాన్ని బయటకు తీయించి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ రవిబాబు నాయక్‌తో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ విషయమై డీసీహెచ్‌ గడ్డమీది రమేష్‌ను వివరణకోరగా మృతదేహం మాయంపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

మరిన్ని వార్తలు