సినీఫక్కీలో చోరీ

9 Feb, 2019 07:59 IST|Sakshi
సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం

రూ.2.14 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల అపహరణ

మహిళను నిర్బంధించి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చిన ఆగంతకులు

తూర్పుగోదావరి, ధవళేశ్వరం: మహిళను నిర్బంధించి చోరీకి పాల్పడ్డారు ముగ్గురు గుర్తు తెలియని ఆగంతకులు. ధవళేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అగ్రహారం మూడో వీధిలో హార్లిక్స్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మేఘం లీలాకృష్ణ కుటుంబంతో సహ నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి ఆయన నైట్‌ డ్యూటీకి వెళ్లారు. సుమారు రాత్రి 12 గంటల సమయంలో లీలాకృష్ణ భార్య జయదుర్గ బాత్‌రూంకి వెళ్లేందుకు ముందువైపు తలుపులు తీశారు. ఇంతలో ఒక గుర్తు తెలియని వ్యక్తి జయదుర్గ అరవకుండా పట్టుకోగా మరో వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి బెదిరించాడు. జయదుర్గను బలవంతంగా బెడ్‌రూంలోకి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి చీరతో కట్టేశారు.

ఈ సమయంలో జయదుర్గకు ఇంజక్షన్‌ ఇచ్చారు. బీరువా తాళం ఎక్కడ ఉందని అరిస్తే చంపేస్తామని బెదిరించారు. మూడో ఆగంతకుడు బీరువా తాళం తీసుకొని దానిలోని రూ.2.14లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేశారు. ఇంజక్షన్‌ ఇవ్వడంతో జయదుర్గ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. డ్యూటీ నుంచి వచ్చిన భర్త లీలాకృష్ణ జయదుర్గ అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమె ధవళేశ్వరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. జయదుర్గ ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్పీ వైవీ రమణకుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. పోలీస్‌ జాగిలాలను రప్పించారు. అవి ఘటనా స్థలం నుంచి అగ్రహారం ప్రధాన రోడ్డు వరకు వెళ్లాయి. చుట్టూ నివాస గృహాలు ఉండే ప్రాంతంలో ఈ తరహా చోరీ జరగడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ధవళేశ్వరం సీఐ ఈ.బాలశౌరి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు