దోపిడీ దొంగల ముఠా అరెస్ట్‌

28 Mar, 2018 12:07 IST|Sakshi
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఓఎస్‌డీ టీపీ విఠలేశ్వర్‌

ఎట్టకేలకు ఐదున్నర ఏళ్లకు కేసు ఛేదన

రూ.11 లక్షల సొత్తు స్వాధీనం   

నెల్లూరు(క్రైమ్‌): దోపిడీకి పాల్పడి ఆరేళ్లుగా పోలీసుల కళ్లు గప్పితిరుగుతున్న ఓ ముఠాను ఎట్టకేలకు సీసీఎస్, నాల్గో నగర పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 11 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం ఓఎస్‌డీ టీపీ విఠలేశ్వర్‌ వివరాలు వెల్ల డించారు. నగరానికి చెందిన వాసా గోపాల్‌రెడ్డి బాలాజీ స్టీల్స్‌లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు కంపెనీకి చెందిన నగదును బ్యాంక్‌ల్లో జమచేసి వచ్చేవాడు. ఈ విషయాన్ని గమనించిన నగరంలోని అనగుంట కాలనీకి చెందిన జగదీష్, నేతాజీనగర్‌కు చెందిన పి.కోటేశ్వరరావు ఎలాగైనా ఆ నగదు కాజేయాలని దోపిడీకి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. తమ స్నేహితులైన తిరుపతి కొర్లగుంటకు చెందిన డి. చిన్న వెంకటేశ్వర్లు, సంతపేటకు చెందిన యు.మాలకొండయ్య, పడారుపల్లికి చెందిన డి.ఆంజనేయులుతో కలిసి వారం రోజులు పాటు గోపాల్‌రెడ్డి కదలికలను దగ్గరగా గమనిస్తూ దోపిడీకి అదను కోసం వేచి చూశారు.  

పోలీసులకు రివార్డులు  
దోపిడీ కేసును ఛేదించిన సీసీఎస్‌ డీఎస్పీ ఎం.బాలసుందరరావు, సీసీఎస్, నాల్గో నగర ఇన్‌స్పెక్టర్‌లు షేక్‌ బాజీజాన్‌సైదా, వి. సుధాకర్‌రెడ్డి, సీసీఎస్‌ ఎస్సైలు హుస్సేన్‌బాషా, మురళీ, హెడ్‌కానిస్టేబుల్స్‌ సురేష్‌కుమార్, వెంకటేశ్వర్లు, ప్రసాద్, పోలయ్య, కానిస్టేబుల్స్‌ రాజేష్, ప్రభాకర్, రమేష్‌కృష్ణ, హరీష్‌రెడ్డి, హోంగార్డులు రామాంజనేయరెడ్డి, ఉదయకుమార్‌ను ఓఎస్‌డీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో సీసీఎస్‌ డీఎస్పీ ఎం. బాలసుందరరావు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.  

దోపిడీ ప్లాన్‌ ఇలా..
2012 ఆగస్టు 29న గోపాల్‌రెడ్డి కంపెనీకి చెందిన రూ.18 లక్షల నగదును  బ్యాంక్‌లో జమ చేసేందుకు స్కూటీలో బయలుదేరాడు. ఈ క్రమంలో అతన్ని జగదీష్, కోటేశ్వరరావు మరోబైక్‌పై వెంబడిస్తూ చిన్న వెంకటేశ్వర్లు, మాలకొండయ్య, ఆంజనేయులను ఆటోలో మాగుంట లేఅవుట్‌లోని అన్నమయ్య సర్కిల్‌ వద్ద ఉండాలని సూచించారు.  సర్కిల్‌ వద్దకు గోపాల్‌రెడ్డి రాగానే ఆటోలో ఉన్న ముగ్గురు నిందితులు గోపాల్‌రెడ్డి బైక్‌కు ఆటోను అడ్డు పెట్టారు. అదే సమయంలో వెనుక  బైక్‌పై వస్తున్న జగదీష్, కోటేశ్వరరావు వేగంగా గోపాల్‌రెడ్డి స్కూటీని ఢీకొనడంతో ఆయన స్కూటీతో సహా కిందిపడిపోయాడు. వెంటనే అ తనిపై దాడిచేసి రోడ్డుపక్కనే పడవేసి çస్కూటీతో సహా దుండగులు ఉడాయించారు. జాతీయ రహదారిపై స్కూటీని ఆపి అందులో ఉన్న నగదును తీసుకుని స్కూటీని అక్కడే పడవేసి వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో నాల్గో నగర పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. అయితే చిన్నపాటి క్లూ కూడా లభ్యం కాకపోవడంతో ఏళ్ల తరబడి కేసుల్లో పురోగతి లేదు.

మిస్టరీ వీడింది ఇలా..
మూడు రోజుల కిందట, సీసీఎస్, నాల్గోనగర పోలీసులు నకిలీ పోలీసుల అవతారం ఎత్తి దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్ట్‌ చేశారు. వారిలో తోటపల్లిగూడూరు ఈదూరుకు చెందిన గుండాల వంశీకృష్ణారెడ్డి పలు కేసుల్లో నిందితుడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అత్యాచారం కేసుల్లో నిందితుడు. జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో అతకి కోట మండలం కొండగుంట గ్రామానికి చెందిన ఎం.హర్షవర్ధన్‌ అలియాస్‌ హర్ష, నెల్లూరురూరల్‌ మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన చల్లా గోవర్ధన్‌ అలియాస్‌ జగ్గు, నెల్లూరు కిసాన్‌నగర్‌కు చెందిన గుండాల మహేంద్రరెడ్డితో పరిచయం అయింది. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి నకిలీ పోలీసుల అవతారమెత్తారు. ఈ నేపథ్యంలో 2012లో జరిగిన దోపిడీ కేసు విషయం జగదీష్‌ (దోపిడీ కేసులో నిందితుడు)ద్వారా హర్షకు తెలిసింది. దోపిడీ విషయాన్ని హర్ష తన స్నేహితుడైన వంశీకృష్ణారెడ్డికి తెలియజేసి దోపిడీకి పాల్పడిన వ్యక్తుల వద్ద నుంచి నగదు వసూలు చేసేందుకు నకిలీ పోలీసుల అవతారమెత్తారు.

అందులో భాగంగా దోపిడీ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి భార్యను బెదిరించి ఈ నెల 17న రూ.3 లక్షలు వంశీకృష్ణారెడ్డి అతని స్నేహితులు దోచుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు నాల్గో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సీసీఎస్, నాల్గో నగర పోలీసులు వంశీకృష్ణారెడ్డి అతని స్నేహితులను ఈ నెల 22న అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా 2012లో జరిగిన దోపిడీ గుట్టురట్టు అయింది. దీంతో నాల్గోనగర పోలీసులు, సీసీ ఎస్‌ పోలీసులు 2012 దోపిడీ కేసులో నిందితులైన జగదీష్, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, మాలకొండయ్య, ఆంజనేయులను మంగళవారం అన్నమయ్య సర్కిల్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.3 లక్షలు విలువ చేసే ఆటో, పల్సర్‌బైక్, కెమెరా మొత్తం రూ.11 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు