మోసగాడు అరెస్ట్‌..

9 Jan, 2020 13:01 IST|Sakshi
మీడియా సమావేశంలో వివరాలువెల్లడిస్తున్న ఎస్‌పి బి.రాజకుమారి (వెనుక ముసుగులో నిందితులు)

పోలీసుల అదుపులో నిందితుడికి సహకరించిన మరో వ్యక్తి

30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం  

అమాయక మహిళలే టార్గెట్‌

విజయనగరం క్రైమ్‌: ఒంటరి మహిళలను టార్గెట్‌ చేయడం... మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన డ్రింక్స్‌ తాగించడం.. అనంతరం వారి ఒంటిమీదున్న బంగారు ఆభరణాలతో ఉడాయించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. దొంగిలించిన సొత్తును బ్యాంక్‌ల్లో తనఖా పెట్టి జల్సా చేయడం అతని అలవాటు. అటువంటి వ్యక్తిని.. అతనికి సహకరించిన మరో వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ రాజకుమారి స్థానిక సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.  శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వండవ గ్రామానికి  చెందిన కొట్టిస లకు‡్ష్మన్నాయుడు రైలు, బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఒంటరిగా ప్రయాణించే మహిళలతో మాటలు కలిపేవాడు. ఈ క్రమంలో వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని వారితో నిత్యం ఫోన్‌లో మాట్లాడేవాడు. వారితో పరిచయాలు పెంచుకుని ఆయా ఊళ్లకు వెళ్లేవాడు. బస్టాండ్‌ దగ్గర ఉన్నానని.. పలానా హోటల్‌ వద్ద ఉన్నానని పరిచయం ఉన్న మహిళలను రప్పించుకుని వారికి మత్తుమందు కలిపిన డ్రింక్‌లు ఇచ్చేవాడు.

అనంతరం వారి  ఒంటిమీదున్న బంగారు ఆభరణాలతో పాటు బ్యాగుల్లో ఉన్న నగదుతో ఉడాయించేవాడు. అనంతరం తన సహచరుడైన పాయకరావుపేటకు చెందిన తోట ప్రసాద్‌ సహాయంతో బంగారు ఆభరణాలను మత్తూట్, మణప్పరం, ఐఐఎఫ్‌ఎల్‌ వంటి ప్రైవేట్‌ సంస్థల్లో తనాఖా పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. ఇటీవల పార్వతీపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళను మభ్యపెట్టి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన ఎస్పీ రాజకుమారి నిందితుడ్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశిస్తూ సీసీఎస్‌ పోలీసులను ఆదేశించారు. దీంతో సీసీఎస్‌ పోలీసులు నెల రోజులుగా విచారణ చేపడుతూ ఎట్టకేలకు నిందితుడు లకు‡్ష్మనాయుడుతో పాటు అతనికి సహకరిస్తున్న తోట ప్రసాద్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. నిందితులు 22 నేరాలు చేసినట్లు అంగీకరించగా.. పోలీసుల విచారణలో మాత్రం 13 కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. నిందితుల  వద్ద నుంచి రూ. 15 లక్షల  విలువైన  30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తనఖాలో ఉన్న మరో 20 తులాల ఆభరణాలు రికవరీ చేసుకోవాల్సి ఉంది. నిందితులను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన  సీసీఎస్‌ ఎస్సై ఐ. సన్యాసిరావు, హెచ్‌సీలు జి.నాగేంద్రప్రసాద్, జి.మహేశ్వరరావు, పి.జగన్‌మోహనరావు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాసరావు, ఎం.వాసులను  ఎస్పీ రాజకుమారితో పాటు సీసీఎస్‌ డీఎస్పీ జె. పాపారావు, విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ సీఎం సన్యాసినాయుడు, సీసీఎస్‌ సీఐలు డి. లకు‡్ష్మనాయుడు, దాసరి లక్ష్మణరావు, కాంతారావు, ధనుంజయరావు, తదితరులు అభినందించారు.  

నిందితుడు గతంలో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగి
నిందితుడు లకు‡్ష్మనాయుడు ఇండియన్‌ ఆర్మీలో 1996 నుంచి 2005 వరకు పనిచేశాడు. అప్పట్లోనే  పలు నేరాలకు పాల్పడడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను  నమ్మించి సుమారు రూ. 70 లక్షల వరకు కాజేశాడు. ఈ సంఘటనపై విశాఖ జిల్లా చీడికాడ  పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. శ్రీకాకుళంలో ఒక హత్యకేసు,  పశ్చిమగోదావరి  జిల్లాలో  ఒక గ్యాంగ్‌ రేప్‌ కేసు, మరో రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసు, గుంటూరు జిల్లాలో మరో రెండు కేసుల్లో లకు‡్ష్మనాయుడు నిందితుడిగా ఉన్నాడు. నిందితుడి భార్య కూడా ఒక దొంగతనం కేసులో మంగళగిరి జైల్లో ఉందని పోలీసులు తెలిపారు.

మహిళలు అప్రమత్తంగా ఉండాలి..
మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి.రాజకుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు  బుధవారం ప్రకటన విడుదల చేశారు. అపరిచిత వ్యక్తులు  చెప్పే మాటలు నమ్మవద్దని.. వారిచ్చే  వస్తువులు,  పానీయాలు, భోజనాలు, టీ, కాఫీ, టిఫిన్స్‌ వంట వి తీసుకోరాదన్నారు.  అనుమానితుల  సమాచారన్ని డయల్‌ 100కి గానీ, వాట్సాప్‌ నంబర్‌ 63098 98989 అందించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు