ఎంపీ కుమారుడి వివాహం చెల్లదు

27 Mar, 2018 07:28 IST|Sakshi
పోలీసుల అదుపులో రొబినా. ప్రక్కన గోడ దూకుతున్న దృశ్యం

బాధిత యువతి రోబినా ఫిర్యాదు

టీ.నగర్‌: జమాత్‌ జరిపించనందున అన్నాడీఎంకే ఎంపీ అన్వర్‌రాజా కుమారుడి వివాహం చెల్లదని, దీనిపై మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు బాధిత చెన్నై యువతి రొబినా ఆదివారం వెల్లడించారు. చెన్నై మడిపాక్కం రాంనగర్‌కు చెందిన ప్రబల్లా సుభాష్‌ అలియాస్‌ రొబినా (36). రేడియో వ్యాఖ్యాత. ఈనెల 23న ఆమె చెన్నై కమిషనర్‌ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే రామనాథపురం ఎంపీ అన్వర్‌రాజా కుమారుడు నాజర్‌అలి తనను వివాహం చేసుకోకుండా మూడేళ్లు సహజీవనం చేశారని తెలిపారు. అతడు పరిశ్రమ ప్రారంభించేందుకు తన నగలు తాకట్టుపెట్టి రూ.30లక్షలు, బంధువుల వద్ద రూ.20 ఇప్పించానని, అయితే తనను వివాహం చేసుకోకుండా మోసగించినట్లు తెలిపారు.

ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి దేవాతో తనకు హత్యా బెదిరింపులు చేశారని ఆరోపించారు. శివగంగై జిల్లా కారైకుడిలో నాజర్‌అలి వేరొక యువతిని వివాహం చేసుకోనున్నారని, ఈ వివాహాన్ని అడ్డుకుని ఎంపీ అన్వర్‌రాజా, నాజర్‌ అలి, దేవాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి రామనాథపురం ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఓం ప్రకాష్‌మీనా దీని గురించి విచారణ జరుపనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శివగంగై జిల్లా కారైకుడి చేరుకున్న రోబినా, నాజర్‌అలికి మరో యువతితో వివాహాన్ని అడ్డుకునేందుకు పోరాడింది.

కారైకుడి కళాశాల రోడ్డు మసీదుకు వెళ్లిన ఆమె అక్కడ జమాత్‌ నిర్వాహకులను కలిసి ఫిర్యాదు చేశారు. నక్షత్ర హోటల్‌ మ్యారేజ్‌ హాల్‌కు చేరుకున్న రోబినా వివాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమె సమీపానగల గోడను దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది.  పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె కల్యాణ మండపం ఎదుట బైఠాయించి ఆందోళన జరిపింది. దీనిగురించి ఆమె విలేకరులతో మాట్లాడుతూ అధికారపార్టీ అండతో ఈ వివాహం జరిగిందని, దీనికి కారైకుడి కాలేజీ రోడ్డు మసీదు జమాత్‌ అంగీకారం లేదని వివరించారు. దీనిపై మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేస్తానని అన్నారు. ఇలాఉండగా జమాత్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ వివాహాన్ని తాము జరిపించలేదని వెల్లడించారు.

మరిన్ని వార్తలు