తండ్రీకొడుకుల్ని బలిగొన్న లారీ

15 Jul, 2018 08:12 IST|Sakshi
ఘటన స్థలంలో పరిశీలిస్తున్న పోలీసులు మృతి చెందిన తండ్రీ కొడుకులు  శ్రీకాంత్, కార్తీకేయ

ఆస్పత్రికని వెళ్లిన నలుగురిలో ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మరో పది నిమిషాల్లో ఇల్లు చేరాల్సిన వీరిని లారీ రూపంలో మృత్యువు కబలించింది. చిన్నారి కూతురు కుర్‌కురే కొనివ్వాలని మారం చేయడంతో తండ్రి బైక్‌ ఆపాడు. తల్లీకూతురు దుకాణానికి వెళ్లగా బైక్‌పై ఉన్న తండ్రీకొడుకులపై అతివేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి మీద పడడంతో అక్కడికక్కడే దర్మరణం పాలయ్యారు. తల్లీబిడ్డలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శనివారం సాయంత్రం రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొక్కలగుట్ట వద్ద జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

రామకృష్ణాపూర్‌/మందమర్రి(చెన్నూర్‌): మందమర్రిలోని రామన్‌కాలనీకి చెందిన బుర్రా శ్రీకాంత్‌గౌడ్‌(30) తన కుటుంబంతో కలిసి శనివారం మం చిర్యాలకు వెళ్లాడు. కూతురును ఆస్పత్రిలో చేపిం చి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలోని బొక్కలగుట్ట వద్ద పాప కుర్‌కురే కావాలని ఏడ్వవడంతో బండి ఆపాడు. భార్య రజిత కూతురు హర్షితను ఎత్తుకుని రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లింది. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు కింద నిలిపిఉన్న బైక్‌పై పడటంతో తండ్రీకొడుకులు శ్రీకాంత్, కార్తీకేయ(4) అక్కడికక్కడే మృతి చెందారు.

క్రేన్‌ సాయంతో మృతదేహాల వెలికితీత
లారీ ప్రమాద ఘటనలో విగతజీవులైనా శ్రీకాంత్‌గౌడ్, చిన్నారుడు కార్తీకేయను బయటికి తీయడానికి పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. లారీ కిందే మృతదేహాలు నుజ్జునుజ్జుకావడంతో వాటిని చాలా జాగ్రత్తగా బయటికి తీశారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్రేన్, పొక్లెయినర్‌ తెప్పించారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి రెండు మృతదేహాలను బయటికి తీశారు. మందమర్రి సీఐ రాంచందర్‌రావు, రామకృష్ణాపూర్‌ ఎస్సై ప్రేంకుమార్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ సహాయక చర్యలు చేపట్టారు.
 
మద్యం సేవించిన డ్రైవర్‌ 
తండ్రీకొడుకుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లారీ డ్రైవర్‌ తప్పతాగి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. లారీ కూడా ఓవర్‌లోడ్‌తో ఉంది. దీనికి తోడు వేగంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌లోడ్‌ పైభాగం కుదిపేస్తూ ఉండడంతో వేగానికి లారీ బోల్తా పడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
ఈ ప్రమాద ఘటనతో బొక్కలగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. అసలే మూలమలుపు.. అందులో ఇరుకురోడ్డు కావడంతో గంటసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మంచిర్యాల–బెల్లంపల్లి మార్గంలో వాహనాలు బారులు తీరాయి.  క్రేన్‌ సాయంతో మృతదేహాలు తీశాక ఎట్టకేలకు పోలీసులు శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మిన్నంటిన రోదనలు
లారీ ప్రమాద ఘటనతో బొక్కలగుట్టలో బంధువులు, చూపరుల రోదనలు మిన్నంటిపోయాయి. ఒకవిధంగా చెప్పాలంటే బొక్కలగుట్ట ప్రాంతమంతా విషాదంలో కూరుకుపోయింది. అప్పటి దాకా తమ కళ్లెదుటే కనిపించిన వాళ్లు ప్రమాదానికి గురైనారని తెలిసీ స్థానికులు కంటతండి పెట్టారు. తండ్రీకొడుకుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మృతుడు శ్రీకాంత్‌ మందమర్రిలోని ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మందమ్రరిలో విషాదం
ఈ ప్రమాదంతో మందమర్రిలో విషాదం నెలకొంది. ప్రమాద విషయం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున ఘటన స్థలికి వెళ్లారు. బాబు వాహనం కింద నుజ్జునుజ్జు కావడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో విగతజీవులైనా శ్రీకాంత్‌గౌడ్, కార్తీక్‌ల అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశాలు ఉన్నాయి. శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించడంతో మృతదేహాలను మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అయ్యాక మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు