బలవంతంగా మా పెళ్లిని అడ్డుకున్నారు

15 Jul, 2018 08:16 IST|Sakshi

న్యాయం చేయాలంటూ జిల్లా జడ్జిని కోరిన యువ జంట

కడప అర్బన్‌ : కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు సాయినగర్‌లో ఉంటున్న ఎం.రాజ్‌కుమార్‌ తాను వివాహం చేసుకున్న ఎం.శిరీషాతో కలిసి వచ్చి.. తమకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన నేషనల్‌ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ తమ పరిస్థితి వివరించారు. తాను పెద్దల సమక్షంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 19న వివాహం చేసుకునేందుకు నిశ్చయం చేసుకోగా.. ముందు రోజు 18న రాత్రి 11 గంటల సమయంలో చైల్డ్‌ హోం నోడల్‌ ఆఫీసర్‌ సి.రామకృష్ణారెడ్డి, వీఆర్‌ఏ వెంకటేశ్వర్లు, వీఆర్వో సాల్మన్లు తదితరులు వచ్చి తమ వివాహాన్ని నిలుపుదల చేశారన్నారు. 

పెళ్లికుమార్తె వయసు నిర్ణీత వయసు కంటే తక్కువగా ఉందని, నిలుపుదల చేశారన్నారు. ఆమె 2000 ఫిబ్రవరి 22న జన్మించినట్లుగా ఆధార్‌ కార్డులో ఉందని, ఈ ప్రకారం మేజర్‌ అయిందని ఎంత చెప్పినా వినకుండా వారు వివాహాన్ని నిలిపి వేశారన్నారు. తాము చూపించిన ఆధారాల గురించి పట్టించుకోకుండా వివాహాన్ని రద్దు చేశారన్నారు. కానీ వివాహం ఆగిపోయినందుకు ఆ సమయంలో తాము తీసుకొచ్చిన లక్షన్నర మేరకు వస్తువులతోపాటు అంతకు ముందే లక్షన్నర మేరకు మొత్తం మూడు లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యాయన్నారు. దీంతో తాము ఆర్థికంగా  నష్టపోయమామని, మానసికంగా వేదన భరించామని చెప్పారు.  తర్వాత పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నామన్నారు. తాము న్యాయవాది ద్వారా నోటీసులు వారికి పంపించినా స్పందన రాలేదన్నారు. కావున తమరు న్యాయం చేసి తగిన నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు రాజ్‌కుమార్, అతని సతీమణి శిరీష విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌లో సమస్యను పరిష్కరిస్తామని సూచించారు.

మరిన్ని వార్తలు