రూ.3 కోట్ల నగదు స్వాధీనం 

17 Nov, 2018 01:41 IST|Sakshi
నగదును స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

పూడూరు మండలం చిట్టెంపల్లి గేట్‌ సమీపంలో పట్టుబడ్డ నగదు 

పరిగి: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు లభ్యమైంది. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం లోని చిట్టెంపల్లిగేట్‌ సమీపంలో హైదరాబాద్‌–వికారాబాద్‌ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వైపు వెళ్తున్న (ఏపీ 09 సీటీ6957) ఐ10 కారును తనిఖీ చేశారు. కారులో రూ.3 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత కారుతో సహా కారులోని వారిని పరిగి అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి తరలించారు.

ఈ డబ్బును హైదరాబాద్‌ జీడిమెట్ల షాపూర్‌లోని ఆదర్శ్‌ బ్యాంకు నుంచి వికారాబాద్, తాండూరులోని ఆదర్శ్‌ బ్యాంకులకు తరలిస్తున్నట్లు కారులోని వ్యక్తులు టి.వెంకటేశ్, అరుణ్‌కుమార్, రామనాగేశ్‌ తెలిపారు. వాటికి సంబంధించి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదు సీజ్‌ చేశారు. ఈ నగదు రంగారెడ్డి జిల్లా ట్రెజరీకి తరలించారు. 

పలు అనుమానాలు: ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు లభ్యమవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే రూ.3 కోట్లు తరలిస్తుండటం, ఈ నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవటం అనుమానాలకు తావిచ్చినట్లైంది. బ్యాంకులకైనా పెద్దమొత్తంలో నగదును తరలించేటప్పుడు సెక్యూరిటీ ఉండాల్సిందేనని నిబంధనలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఆ డబ్బులు ఎక్కడివన్న కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు