బ్రోకర్లు, రౌడీషీటర్లు, గూండాలకు టికెట్లిచ్చారు

17 Nov, 2018 01:45 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జనార్దన్‌. చిత్రంలో రవీందర్, విజయరామారావు, రాజీవ్‌

మాజీ మంత్రులు బోడ జనార్దన్, విజయరామారావు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌పార్టీలో బ్రోకర్లు, గూండాలు, రౌడీషీటర్లకు టికెట్లు కేటాయించారని మాజీమంత్రులు బోడ జనార్దన్, విజయరామారావు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం ఐదేళ్లుగా కష్టపడిన తమను కాదని పారాచూట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ టికెట్లు రాని ఆశావహులతో కలసి తెలంగాణ రెబెల్స్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో జనార్దన్, విజయరామారావు, ధర్మపురి టికెట్‌ ఆశించిన మద్దాల రవీందర్‌ మాట్లాడారు. టికెట్ల కోసం పార్టీలోకి వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని రాహుల్‌ ఎన్నో సభల్లో, సమావేశాల్లో సూచించినా ఉత్తమ్, ఆర్‌.సి.కుంతియా టికెట్ల కోసం బేరమాడి, ఎంత ఖర్చు పెడతారో చెప్పాలంటూ అభ్యర్థిత్వాలను అమ్ముకున్నారన్నారు. తమ వద్ద ఆధారాలున్నాయని త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు. పార్టీ సభ్యత్వంలేని 19 మందికి టికెట్లు అమ్ముకున్నారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కావాలనే అభ్యర్థుల జాబితాను లీక్‌ చేసి, తర్వాత మీడియాలో వచ్చింది నమ్మవద్దంటూ చెప్పారని, తీరా అదే జాబితా అధికారికంగా వెలువడటం వెనుక ఎన్నికోట్లు చేతులు మారాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

40 మందితో రెబెల్స్‌ ఫ్రంట్‌ జాబితా... 
తెలంగాణ ఇచ్చినందుకు సోనియా రుణం తీర్చుకోవాల్సిన తాము రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరామని, ముందస్తు ఎన్నికల నాటికి తామే అభ్యర్థులుగా ఉన్నామని  జనార్దన్‌ అన్నారు. తీరా ఎన్నికలు దగ్గరపడేసరికి పారాచూట్లకు టికెట్లను అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారాచూట్లకు టికెట్లుండవని రాహుల్‌ చెప్తుంటే ఉత్తమ్, కుంతియా, భట్టి విక్రమార్క మహాకూటమి పేరుతో మాయకూటమి పెట్టి టికెట్లు అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్‌ గెలవాల్సిన చోట ఓడిపోయే వ్యక్తులను నిలుచోబెట్టి పార్టికి నష్టం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడినా టికెట్లు రాని 40 మంది అభ్యర్థులతో తాము తెలంగాణ రెబల్స్‌ ఫ్రంట్‌గా ఏర్పడుతున్నామని వెల్లడించారు. రెండు రోజుల్లో రెబల్స్‌ జాబితా విడుదలు చేస్తామని తెలిపారు.  

నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తికి టికెటిస్తారా? 
కరీంనగర్‌ జిల్లా ధర్మపురి నుంచి నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మళ్లీ టికెట్‌ ఇవ్వడం రాహుల్‌ గాంధీ పెట్టిన నిబంధనలకు విరుద్ధమని రవీందర్‌ అన్నారు. స్క్రీనింగ్, కోర్‌ కమిటీ సమావేశాల్లో తన లాంటి స్థానిక నేతలు, యువకుల పేర్లు తుదిదశలో పరిశీలనకు వచ్చినా, వాటిని పక్కన పెట్టి ఉత్తమ్, కుంతియా, మరికొందరు సీనియర్లు టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. రెబెల్స్‌ఫ్రంట్‌ తరపున ధర్మపురి నుంచి పోటీ చేస్తున్నట్టు రవీందర్‌ చెప్పారు.   

మరిన్ని వార్తలు