జీవీకే గ్రూపునకు సీబీఐ షాక్!

2 Jul, 2020 08:57 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎయిర్ పోర్ట్ స్కాం కేసులో జీవీకే గ్రూపునకు సీబీఐ షాక్ ఇచ్చింది. జీవీకే గ్రూపు ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్  జీ వెంకట కృష్ణారెడ్డి, ముంబై  ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (మియాల్), జీవీకే కుమారుడు, మియాల్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డిపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 705 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడిన ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో మరో తొమ్మిది ప్రైవేట్ సంస్థలపైనా ఎఫ్ఐఆర్  నమోదు చేసింది.  అలాగే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, 2012-2018 మధ్య కాలంలో అక్రమంగా 705 కోట్లకు పైగా లాభాలను ఆర్జించారనేది ప్రధాన ఆరోపణ. 

జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఇతర విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన జాయింట్ వెంచర్ "ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్'' లేదా మియాల్. ఇందులో జీవీకే వాటా 50.5 శాతం  కాగా, 26 శాతం వాటా ఏఏఐ సొంతం. 2006 లో ఏఏఐ, మియాల్ ఒప్పందం ప్రకారం ముంబై విమానాశ్రయ నిర్వహణ మియాల్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ ఆదాయంలో 38.7 శాతం వార్షిక రుసుముగా ఏఏఐకి చెల్లించాల్సి  ఉంటుంది. మిగిలిన నిధులు  విమానాశ్రయం ఆధునీకరణ, ఆపరేషన్, నిర్వహణ కోసం  ఉద్దేశించింది. 

అయితే తొమ్మిది ప్రైవేటు సంస్థలతో చేతులు కలిపి బోగస్ వర్క్ కాంట్రాక్టులు చూపించి 310 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. వీటిలో ఎక్కువ భాగం 2017-18 మధ్య ముంబై విమానాశ్రయం చుట్టూ 200 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వినియోగించినట్టు పేర్కొంది. జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని , తద్వారా జాయింట్ వెంచర్ కంపెనీకి 100 కోట్ల రూపాలయకు పైగా నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది.  అదే కాలంలో నిందితులు  మియాల్ ఆదాయాన్ని తక్కువగా నివేదించారని దర్యాప్తులో తేలిందనీ, దీంతో కలిపి ప్రభుత్వ ఖజానాకు  మొత్తం నష్టం రూ .1,000 కోట్లకు పైగా ఉంటుందని  సీబీఐ వర్గాల వాదన.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా