పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి!

30 Mar, 2019 12:02 IST|Sakshi
చిన్నారి మృతదేహం దగ్గర విలపిస్తున్న తల్లి రుక్మబాయి , విద్యార్థులను విచారిస్తున్న ఏటీడీవో సౌజన్య, మల్లీశ్వరి (ఫైల్‌)

సాక్షి, బజార్‌హత్నూర్‌(బోథ్‌): చిన్నపాటి జ్వరానికే ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. ఈ ఘటన అందరినీ విస్తుగొల్పింది. అయితే, చిన్నారి మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బజార్‌హత్నూర్‌ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన కొడప మల్లేశ్వరి అదే మండలంలోని మాడగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోది. గురువారం ఉదయం నుంచి మల్లేశ్వరి జ్వరంతో బాదపడుతుంటే పాఠశాలకు చెందిన ఏఎన్‌ఎం అనుసూయ పారసెటమల్‌ మాత్రలు ఇచ్చింది.

కానీ, సాయంత్రం వరకు జ్వరం తగ్గకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా కావడంతో ఆ సమయంలో హెచ్‌ఎం రమేష్, ఏఎన్‌ఎం అనసూయ అందుబాటులో లేకపోడడంతో వార్డెన్‌ దేవరావ్‌ బజార్‌హత్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బోథ్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మల్లీశ్వరి అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. కానీ, అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు రిమ్స్‌ వైద్యులు తెలపడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన కొలాంగూడ గ్రామానికి తరలించారు. ఈ క్రమంలోనే చిన్నారి మృతదేహాన్ని అంబు లెన్స్‌లో తీసుకెళ్లుండగా తన కూతురు మరణానికి పాఠశాల సిబ్బందే కారణమని మృతురాలి తండ్రి కొడప నారాయణ హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేయబోయారు. కానీ, గ్రామస్తులు సముదాయించి అతన్ని శాంతింపజేశారు.

కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం చేసేవరకు చిన్నారి మృతదేహంను తీసుకోమని బీష్మించారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రెండెకరాల సాగుభూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అబ్దుల్‌బాఖీ, ఏటీడీవో సౌజన్య ఫోన్‌లో ఐటీడీఏ డీడీ చందనతో మాట్లాడి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు.

రాత్రి దాకా చెప్పలేదు..
చిన్నారి మల్లీశ్వరి గురువారం ఉదయం నుంచే జ్వరంతో బాదపడుతున్నా.. ఈ విషయాన్ని తమ కు తెలుపలేదనీ, రాత్రి మాత్రం బజార్‌హత్నూర్‌ పీహెచ్‌సీకి తీసుకెళ్తున్నామని మాత్రం తెలిపారని తల్లితండ్రులు కొడప నారాయణ, రుక్మబాయి బోరున విలపిస్తూ వివరించారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక మాట కూడా తెలుపలేదని రాత్రి కూడా ఇదే విషయమడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడారని మారోపించారు. గురువారమే తమకు చెప్పి ఉంటే ఎలాగోలా కూతురిని కాపాడుకునేవాళ్లమని వారు కన్నీరుమున్నీరయ్యారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..
మల్లీశ్వరి మృతి విషయం తెలుసుకున్న ఏటీడీవో సౌజన్య కొలాంగూడ గ్రామానికి చేరుకుని ఆమె తల్లితండ్రులను ఓదార్చారు. అనంతరం మాడగూడ ఆశ్రమ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థులను విచారించారు. భోజనాన్ని, తాగునీరు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థిని మృతి రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు పంపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

పాఠశాలలో హెల్త్‌ క్యాంప్‌
విద్యార్థిని మృతి సంఘటనతో అప్రమత్తమైన వైద్యారోగ్య సిబ్బంది మాడగూడ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం ప్రభుత్వ వైద్యుడు హరీష్‌ అధ్వర్యంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. అన్ని తరగతుల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్‌ అసిస్టెంట్‌ గాజుల రమేష్, ఏఎన్‌ఎం అనసూయ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు