రట్టవుతున్న 'ఇన్‌సైడర్‌' గుట్టు

1 Mar, 2020 05:00 IST|Sakshi
లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్న సిట్‌ అధికారులు

కంచికచర్లలో టీడీపీ నేత లక్ష్మీనారాయణ ఇంట్లో సిట్, సీఐడీ సోదాలు

లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు ఇంట్లోనూ సోదాలు 

పలు కీలక పత్రాలు, సీడీలు స్వాధీనం 

సాక్షి, అమరావతి/కంచికచర్ల: రాజధాని అమరావతిలో గత టీడీపీ సర్కారు హయాంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో టీడీపీ నేతలకు ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పక్కా ఆధారాలు చిక్కుతున్నాయి. కృష్ణా జిల్లాలో శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌), శనివారం సీఐడీ వరుసగా నిర్వహించిన సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. సీఐడీ ప్రత్యేక బృందాలు కృష్ణా జిల్లా కంచికచర్లలో పలువురు టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్‌ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్‌ జనరల్‌గా(ఏజీ) పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌.. నన్నపనేని లక్ష్మీనారాయణకు స్వయానా అల్లుడే. కాగా, లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేశారు. 

ఇంటి నుంచి పరారైన లక్ష్మీనారాయణ 
అమరావతిలో భూముల కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుడి ఇంట్లో శుక్రవారం సిట్‌ సోదాలు నిర్వహించింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. అలాగే కంచికచర్లలో సీతారామరాజు ఇంట్లోనూ సిట్‌ అధికారులు సోదాలు జరిపారు. దీంతో నన్నపనేని లక్ష్మీనారాయణ తన ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. శుక్రవారం కంచికచర్లలోని లక్ష్మీనారాయణ నివాసంలో సోదాల కోసం వెళ్లిన సీఐడీ ప్రత్యేక బృందానికి ఆయన దొరకలేదు. ఇంటికి తాళం వేసి ఉండటం, లక్ష్మీనారాయణతోపాటు కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో సీఐడీ అధికారులు శుక్రవారం సెర్చ్‌ వారెంట్‌ను ఆయన ఇంటి గోడకు అతికించి వెనుతిరిగారు.

సీఐడీ ప్రత్యేక బృందాల ఏర్పాటు!  
అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దర్యాప్తును వేగవంతం చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఐడీ నిర్ణయించింది. భూ కుంభకోణాలు, భూ వివాదాలు, రికార్డుల తారుమారు తదితర కీలక అంశాలపై దర్యాప్తు చేసిన అనుభవం కలిగిన పోలీసు అధికారులను సీఐడీ విభాగంలోకి తీసుకొచ్చి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందానికి డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. 

4 గంటలపాటు సీఐడీ సోదాలు 
తన కుమారుడు సీతారామరాజు ఇంట్లో శుక్రవారం సిట్‌ సోదాలు ముగియడం, సీఐడీ అధికారులు వచ్చి వెళ్లిపోవడంతో లక్ష్మీనారాయణ శనివారం తన ఇంటికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐడీ అధికారులు శనివారం ఉదయం మరోమారు లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలకు వెళ్లారు. లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు నివాసంలోనూ 4 గంటలపాటు సీఐడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు కీలకపత్రాలు, సీడీలను స్వాధీనం చేసుకున్నాయి. టీడీపీ నేత  లక్ష్మీనారాయణ అమరావతిలో తక్కువ ధరకే విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగానే తెలుసుకుని విలువైన భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనేశారని స్థానికులు చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు