సా‹ఫ్ట్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య

2 May, 2019 08:26 IST|Sakshi
రోహిత్‌ సామ్యూల్‌ (ఫైల్‌) సంఘటనా స్ధలాన్ని పరిశీలిస్తున్న డీసీపీ ఉమామహేశ్వరరావు

మల్కాజిగిరి: ఉద్యోగంలో చేరాల్సిన రోజే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తార్నాక, విజయపురికాలనీకి చెందిన నజ్రీనారావు కుమారుడు జాషువా రోహిత్‌ సామ్యూల్‌(27)ఓ కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల అతడికి జెన్‌ప్యాక్‌లో ఉద్యోగం రావడంతో బుధవారం విధుల్లో చేరాల్సివుంది. అయితే బుధవారం మౌలాలి రైల్వేస్టేషన్‌ సమీపంలోని పొదల్లో ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతని వద్ద ఉన్న పాన్‌కార్డు, సెల్‌ఫోన్ల ద్వారా మృతుడిని రోహిత్‌ సామ్యూల్‌గా నిర్ధారించారు. సంఘటనా స్ధలంలో మద్యం సేవించిన ఆనవాళ్లు ఉన్నాయి. డీసీపీ ఉమామహేశ్వరరావు, ఏసీసీ సందీప్‌  సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలను సేకరించింది. కాగా రోహిత్‌ సామ్యూల్‌కు ఇటీవలే పెళ్లి కుదిరినట్లు సమాచారం.

స్నేహితుల పనేనా?
 సామ్యూల్‌ను బండరాయితో మోది హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మద్యం బాటిళ్ల పై  లేబుల్‌ ఆధారంగా సికింద్రాబాద్‌లోని ఓ మద్యం దుకాణంలో కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. సంఘటనా స్ధలంలో మద్యం సేవించిన ఆనవాళ్లు ఉండటంతో పథకం ప్రకారమే రోహిత్‌ను అక్కడికి రప్పించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక ఫోన్‌కు లాక్‌ ఉండడంతో దానిని ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరో ఫోన్‌కు వచ్చిన కాల్‌ డేటాను విశ్లేషిస్తున్నారు. రోహిత్‌ నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఇంట్లో ఉన్న రోహిత్‌ తెల్లవారే సరికి హత్యకు గురికావడం పట్ల తెలిసిన వారి పనిగా భావిస్తున్నారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలి: నజ్రీనారావు
రోహిత్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రోహిత్‌ తల్లి నజ్రీనారావు అన్నారు. తన పెద్ద కుమారుడు పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, ఇప్పుడు ఉన్న ఒక్క కొడుకు కూడా దూరమైపోయాడని ఆమె బోరున విలపించింది. బుధవారం జెన్‌ప్యాక్‌లో ఉద్యోగంలో చేరాల్సి ఉందని, మంగళవారం రాత్రి 12 గంటలకు ఇంట్లో భోజనం చేశాడని ఆ తర్వాత తాను నిద్రపోయానని తెల్లవారిన తర్వాత రోహిత్‌ కనిపించకపోవడంతో సెల్‌కు ఫోన్‌ చేయగా స్పందించలేదన్నారు. చివరకు మృతుడిగా చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు