సీరియల్ రేపిస్ట్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

17 Nov, 2017 10:55 IST|Sakshi

సాక్షి, చెన్నై : చోరీకేసులో తాము అదుపులోకి తీసుకున్న నిందితుడు సీరియల్ రేపిస్ట్ అని తెలిసి పోలీసులే షాకయ్యారు. వారి విచారణలో మరిన్ని ఆశ్చర్యకర నిజాలు వెల్లడవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. తమ ఇంట్లో చోరీ జరిగిందని, విలువైన వస్తువులతో పాటు కొంత నగదు ఓ దొంగ ఎత్తుకెళ్లాడని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు మదన్ అరివలగన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణలో భాగంగా అరివలగన్‌ మొబైల్‌ లోని వీడియోలు చూసిన పోలీసులు కంగుతిన్నారు. దాదాపు 50 మంది వరకు యువతులు, మహిళలపై అత్యాచారం జరుపుతుండగా తీసిన వీడియోలు నిందితుడి స్మార్ట్‌ఫోన్లో ఉన్నాయి. దీంతో చోరీ కేసు కాదు, సీరియస్ కేసు అని భావించిన పోలీసులు నిందితుడిని పలు విధాలుగా విచారించారు. తమది క్రిష్ణగిరి జిల్లా మథుర్‌ గ్రామం అని, క్రిష్ణగిరి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు నిందితుడు తెలిపాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చేశానని, 2015లో అక్కడ జాబ్ మానేసి చెన్నైకి వచ్చినట్లు పేర్కొన్నాడు.

తొలుత ఉద్యోగం కోసం యత్నించగా ఎవరూ పట్టించుకోలేదని, మెల్లమెల్లగా చోరీలకు అలవాటు పడ్డానని, ఆపై ఒంటరి యువతులు, మహిళలున్న ఇళ్లే లక్ష్యంగా చేరీలకు పాల్పడేవాడినని విచారణలో ఒప్పుకున్నాడు. అదే సమయంలో తన గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటారని, చోరీ చేసిన 50 ఇళ్లల్లో యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడటంతో ఆ కీచకపర్వాన్ని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు నిందితుడు మదన్ అరివలగన్‌ వివరించాడు. ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక్క ఫిర్యాదు అందిందని, పరువు పోతుందని భయపడి బాధితురాళ్లు ఫిర్యాదు చేయడం లేదని పోలీసులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు