పాతకక్షలతోనే ఆశప్పపై దాడి

15 Jan, 2019 10:34 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రెమారాజేశ్వరి

పంచాయతీ ఎన్నికల్లో టార్గెట్‌

పక్కా ప్లాన్‌తో హత్యాయత్నం

ఆశప్పపై దాడి చేసిన 11 మంది అరెస్ట్‌

పరారీలో మరో నలుగురు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమారాజేశ్వరి 

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: గతంలో జరిగిన ఘటనలు.. భూ పంచాయితీలు.. పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఆశప్పపై  హత్యాయత్నం జరిగిందని మహబూబ్‌నగర్‌ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి ఆశప్ప కదలికలపై నిఘాపెట్టి పక్కా ప్లాన్‌తో దాడి చేశారని తెలిపారు. ఈనెల 9న మరికల్‌ వద్ద అభంగపూర్‌ గ్రామానికి చెందిన ఆశప్ప అలియాస్‌ అశోక్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసు వివరాలను సోమవారం ఎస్పీ రెమా రాజేశ్వరి తన కార్యాలయంలో వెల్లడించారు. అభంగపూర్‌కు చెందిన ఆశప్ప ఈనెల 9న రాత్రి ఊరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో మరికల్‌ దగ్గర చాయ్‌ తాగడానికి కారు నిలిపిన సమయంలో దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై ఆ శప్ప అన్న కూతురు వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలిపారు.  దాడికి పా ల్పడినవారు అభంగపూర్‌లోనే ఉన్నట్లు సమాచా రం రావడంతో ఆదివారం అదుపులోకి తీసుకున్న ట్లు చెప్పారు. ఏఎస్పీ, నారాయణపేట డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను రంగంలోకి దిగి అనతికాలంలోనే కేసును ఛేదించినట్లు తెలిపారు. 

పాత పగలతోనే దాడి       
అభంగపూర్‌కు చెందిన ఆశప్పకు అదే గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌ కుటుంబం మధ్యన భూ పంచాయతీ గొడవలు జరుగుతున్నాయి. 1999 లోనే వీరిమధ్య పగలు  మొదలయ్యాయి. ఈ సమయంలో ఆశప్ప అదే ఏడాది విజయ్‌కుమార్‌ ఇంటిపై బాంబులు వేయించాడు. ఈ కేసులో అప్పట్లో ఆశప్పను అరెస్టు చేసి జైలుకు పంపారు. 2001, 2004లో మళ్లీ రెండు కుటుంబాల మధ్యన గొడవలు జరిగాయి. ఈ సమయంలో విజయ్‌కుమార్‌ అభంగపూర్‌ నుంచి ఆశప్పను లేకుండా చేయాలని చూశాడు. దీంతో అతనిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో జైలులో విజయ్‌కుమార్‌కు సిద్ధార్థ్, ప్రశాంత్, శ్రావణ్‌గౌడ్, మణికాంత్, జగన్‌గౌడులతో పరిచయం ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి పలుసార్లు పథకం వేసుకుంటూ వచ్చారు.  

పంచాయతీ ఎన్నికల్లో దొరుకుతాడని.. 
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆశప్ప తరుపు బంధువులు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో మళ్లీ  ఆశప్ప గ్రామంలో ఆధిపత్యం వస్తుందని భావించిన ప్రత్యర్థులు  పథకం వేసి హత్య చేయాలని భావించారు. పం చాయతీ ఎన్నికల  నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుం చి ఆశప్ప కదలికలు చెప్పడానికి విజయ్‌కుమార్‌ ఇద్దరు వ్యక్తులు నగేష్, ఆంజనేయులను  నియమించాడు. హత్యాయత్నం జరిగిన రోజు కూడా ఆశప్ప కదలికలను నగేష్, ఆంజనేయులు ఎప్ప టికప్పుడు విజయ్‌కుమార్‌కు చేరవేశారు. ఆ సమయంలో విజయ్‌కుమార్‌ బంధువులు లింగప్ప, సుభాష్, ప్రవీణ్, సంజీవ్, రవికుమార్, విజయ్‌కుమార్, హరికుమార్‌ కలిసి మూడు కత్తులు తీసుకొని వెంబడించారు. అంతకుముందు నగేష్, ఆంజనేయులు కలిసి ఆశప్ప నారాయణపేట నుంచి బయలుదేరిన వెంటనే చెప్పడంతో విజయ్‌కుమార్‌ తన స్నేహితులు అయిన సిద్దార్థ్, ప్రశాంత్, శ్రావణ్‌గౌడు, మణికాంత్‌లు కలిసి ఏపీ 15బీసీ 4204 నెంబర్‌ కల్గిన కారులో మరికల్‌ దగ్గరకు చేరుకున్నారు. ఆశప్ప టీ హోటల్‌ దగ్గర ఉండటంతో మొదట విజయ్‌కుమార్‌ తన దగ్గర ఉన్న పిస్టల్‌తో షూట్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పిస్టల్‌ స్ట్రక్‌ అయి పేలకపోవడంతో వెంట ఉన్న సిదార్థ్, ప్రశాంత్, శ్రావణ్‌గౌడు, మణికాంత్‌లు కత్తులో దాడి చేశారు. ఈ సమయంలో హోటల్‌ దగ్గర ఎక్కువగా రద్దీగా ఉండటంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. రక్తగాయాలతో ఉన్న ఆశప్పను స్థానికులు, పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

నిందితులు వీరే..
ఆశప్ప హత్యాయత్నాం కేసులో ఏ–1గా విజయ్‌కుమార్, ఏ2గా సిదార్థ్, ఏ–3 ప్రశాంత్, ఏ–4 మణికాంత్, ఏ–5శ్రావణ్‌గౌడు, ఏ–6నగేష్, ఏ–7 ఆంజనేయులు, ఏ–8 జగన్‌గౌడు, ఏ–9 సుభాష్, ఏ–10 లింగప్ప, ఏ–11 సంజీవ్, ఏ–12 రవికుమార్, ఏ– 13 ప్రవీణ్, ఏ–14 హరికుమార్, ఏ–15గా విజయ్‌కుమార్‌గా గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. దీంట్లో ఏ–2 సిద్దార్థ్, ఏ–8 జగన్‌గౌడ్, ఏ–14 హరికుమార్, ఏ–15 విజయ్‌కుమార్‌లు పరారీలో ఉన్నారు.  

నేరచరిత్రపై విచారణ 
ఆశప్పపై హత్యాయత్నాకి యత్నించిన విజయ్‌కుమార్‌కు సంబంధించిన నేర చరిత్రపై కూడా విచారణ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. అతను గతంలో ఎక్కడ పని చేశాడు, ఏ వ్యక్తులతో కలిసి ఉన్నాడో ప్రతి అంశంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇదిలాఉండగా కేసును త్వరగా ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, మరికల్‌ సీఐ ఇఫ్తాకర్‌ అహ్మద్, ఎస్‌ఐ జానకిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు