ఆపే "దమ్ము" లేదా..?

6 Dec, 2017 11:11 IST|Sakshi

అమలు కాని బహిరంగ ధూమపాన నిషేధ చట్టం

బహిరంగ ప్రదేశాల్లో  యథేచ్ఛగా ధూమపానం

చట్టాన్ని గాలికి వదిలేసిన పోలీసులు

సినిమా హాళ్లలో హెచ్చరికలు, టీవీ సీరియళ్లలో స్క్రోలింగ్‌లు, హోర్డింగుల్లో సూచనలు తప్పితే ధూమపాన నిషేధ చట్టం వాస్తవంలో అమలు కావడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనే గుప్పుగుప్పుమంటూ పొగ వదులుతున్నా చర్యలు తీసుకునే నాథుడు కానరావడం లేదు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారం పొగరాయుళ్లు ‘టొబాకోపనిషత్తు’ను వల్లె వేస్తున్నా పల్లెత్తు మాటనే వాడు కనిపించడం లేదు. ఫలితంగా ఇప్పటికే కాలుష్యంతో పొగ బారిన పరిసరాలు ఇంకాస్త కలుషితమవుతున్నాయి. మరీ ముఖ్యంగా నిషేధ చట్టం ఉందనే విషయమే మర్చిపోయే ప్రమాదం కలుగుతోంది.

శ్రీకాకుళం: ప్యాషన్‌ అంటూ కొందరు, అలవాటంటూ ఇంకొందరు పొగాకును కాల్చి పారేస్తున్నారు. ఇందులో విద్యార్థులు, యువకులు అధికంగా ఉన్నారు. అడిగేవారు లేరని ఇష్టానుసారంగా బహిరంగ ధూమపానం చేస్తున్నారు. బస్టాండు, సినిమా హాళ్లు, టీ దుకాణాల వద్ద విచ్చలవిడిగా పొగ తాగుతున్నారు. ధూమపాన నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంతో వీరి అలవాటుకు అడ్డుకట్ట పడడం లేదు.

పొగ తాగేవారితోపాటు ఆ పొగ పీల్చే వారిలో 30 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తున్నా యి. పొగాకు, సిగరెట్టు ఉత్పత్తులతో తలెత్తుతున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుం బ సంక్షేమ మంత్రిత్వశాఖ 2008, అక్టోబర్‌ 2న బహిరంగ ధూమపాన నిషేధ చట్టం (సీఓటీపీ–2008) రూపొందించింది.

చట్టం ఏమి చెబుతోంది..?
సీఓటీపీ చట్టం ప్రకారం బస్టాండు, రైల్వే స్టేషన్, సినిమా హాళ్లు, మార్కెట్, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసంచారం ఉండే ప్రదేశాల్లో ధూమపాన నిషేధం అమలులో ఉంది. దీన్ని అతిక్రమిస్తే రూ. 200 జరిమానాతోపాటు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లలోపు ఉన్న వారికి అమ్మినా జరిమానా విధించాలి. పొగాకు నియంత్రణ, బహిరంగ ధూమపానాన్ని అరికట్టేందుకు, చట్టం అమలు బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. పోలీసు అధికారులకు చట్టం గురించి అవగాహన ఉన్నా తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

నష్టాలే నష్టాలు
పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువగా క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతోపాటుపాటు ఇతర ప్రాణాంతక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రత్యక్షంగా తీసుకోకున్నా ఇతరులు వదిలే పొగ పీల్చినా వ్యాధుల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. పోలీసు అధికారులు ఇప్పటికైనా స్పందించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి. సిగరెట్ల రేట్లు పదిశాతం పెంచితే వాటి  వాడకం నాలుగైదు శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పేర్కొన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

శ్వాసకోస వ్యాధులు వస్తాయి
పొగరాయుళ్లు వదిలే పొగను పక్కన  ఉన్న వ్యక్తులు పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. బహిరంగ ధూమపానం మంచిది కాదు.
– డాక్టర్‌ సునీల్‌నాయక్, రిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా