శ్రీవైష్ణవి ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య

5 Feb, 2020 05:32 IST|Sakshi

బిల్డింగ్‌ ఖాళీ చేయాలని యజమాని, మరికొందరి వేధింపులు

తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన అజయ్‌కుమార్‌

తన చావుకు కరుణరెడ్డి, కొండల్‌రెడ్డితో పాటు మరికొందరు కారణమంటూ లేఖ

నాగోలు: భవనం ఖాళీ చేయాలని యజమానితోపాటు మరికొందరు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ ఆస్పత్రి ఎండీ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా శాఖాపూర్‌(వై) గ్రామానికి చెందిన అజయ్‌కుమార్‌(38).. భార్య శ్వేత, కుమారులు వర్షిత్, హర్షిత్‌తో కలసి బీఎన్‌ రెడ్డి నగర్‌లో ఉంటున్నాడు. సాగర్‌ రింగ్‌ రోడ్డు సరస్వతి నగర్‌ కాలనీలో ఉండే కరుణరెడ్డి ఓ బిల్డింగ్‌ నిర్మిస్తోన్న క్రమంలో అందులో ఆస్పత్రి ఏర్పాటుకు అజయ్‌ రూ.10 లక్షలు  అడ్వాన్స్‌ ఇచ్చాడు. అయినా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో అజయ్‌ మరికొంత డబ్బుతో పూర్తిచేసి శ్రీవైష్ణవి హాస్పిటల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉంటూ డాక్టర్లతో ఆస్పత్రిని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా ఆస్పత్రి సరిగా నడవక అద్దె ఆలస్యం కావడంతో బిల్డింగ్‌ ఖాళీ చేయాలని కరుణరెడ్డి చెప్పాడు. కొంత సమయం ఇవ్వాలని కోరినా కరుణరెడ్డి నిరాకరించి కోర్టులో కేసు వేశాడు.

తాడుతో ఉరి వేసుకుని..: కొద్దిరోజులు ఆస్పత్రిని మూసివేసి మూడ్రోజుల క్రితమే అజయ్‌ మళ్లీ ప్రారంభించాడు. బిల్డింగ్‌ ఖాళీ చేయాలని కరుణరెడ్డి, అతని బావమరిది కొండల్‌రెడ్డితోపాటు మరికొందరు అజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. వేధింపులు ఎక్కువ కావడంతో అజయ్‌కుమార్‌ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి 2 గంటల వరకు ఆస్పత్రిలో ఉన్న అజయ్‌కుమార్‌ సెల్లార్‌లో ఉన్న తన గదికి వెళ్లి తా డుతో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు.

మంగళవారం ఉదయం ఆస్పత్రిలో పనిచేసే స్వా మి వచ్చి.. అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి ఎల్‌బీనగర్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు కరుణరెడ్డి, కొండల్‌రెడ్డి, తుర్కయంజాల్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ కొత్తకురుమ్మ శివకుమార్, సరస్వతినగర్‌ కాలనీ అధ్యక్షుడు మేఘారెడ్డి, యాదగిరిరెడ్డి, శివారెడ్డితో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ రమేష్‌ కారణమని అందులో ఉంది. పిల్లలను మంచిగా చూసుకోవాలని భార్యకు రాసిన మరో లేఖ లభించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు