వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

11 Aug, 2019 11:10 IST|Sakshi
రత్నశ్రీ కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్సై, (అంతరచిత్రం) రత్నశ్రీ (ఫైల్‌ఫొటో) 

సాక్షి, కామవరపుకోట(పశ్చిమగోదావరి) : కామవరపుకోటలోని కోటగట్టు ప్రాంతానికి చెందిన కె.రత్నశ్రీ (18) ఆకతాయి వేధింపులు తాళలేక శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుందని తడికలపూడి ఎస్‌ఐ కె.సతీష్‌ కుమార్‌ తెలిపారు. రత్నశ్రీ నాయనమ్మ వీరవెంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం..రత్నశ్రీ స్థానిక వెంకటేశ్వర జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రత్నశ్రీ తల్లి చిన్నతనంలోనే  చనిపోగా, ఇటీవలే తండ్రి కూడా మరణించాడు. దీంతో నాయనమ్మ ఆలనాపాలనా చూస్తోంది.

కోటగట్టు ప్రాంతానికి చెందిన వామిశెట్టి నాగు గత ఏడాదిగా రత్నశ్రీ వెంటపడి వేధిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రత్నశ్రీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు తాళలేక మనస్తాపంతో శనివారం ఉదయం విషం తాగింది. మనవరాలిని నిద్ర లేపటానికి వెళ్ళిన నాయనమ్మ వీరవెంకమ్మకు పురుగుల మందు వాసన రావడం, రత్నశ్రీ అపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రత్నశ్రీ మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు