ఆరిన ఆశాదీపం

14 Nov, 2018 06:43 IST|Sakshi
రైలు పట్టాల పక్కన సాయి మృతదేహం

రైలు ఢీకొని భవిత విద్యార్థి దుర్మరణం

కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థి తల్లిదండ్రులు

విజయనగరం, నెల్లిమర్ల: కుమారుడు బధిరుడైనా ఆ తల్లిదండ్రులు ఏనాడు కుంగిపోలేదు. పిల్లాడి వల్ల ఏమవుతుందిలే అని అనుకోలేదు. ఎప్పటికైనా తమకు నీడనిచ్చే వాడు, కష్టాల నుంచి గట్టెక్కించే వాడు ఆ కొడుకేనని మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశారు. సమాజం నుంచి వినిపించే విమర్శలను వినిపించుకోకుండా అల్లారుముద్దుగా కొడుకును పెంచుకున్నారు. ఎలాగైనా ప్రయోజకుడిని చేయాలని భవిత కేంద్రంలో చేర్పించారు. కుమారుడు తమ మందు తిరుగుతుంటే అదే భాగ్యమని తలచి పొంగిపోయారు. కానీ వారి ఆశా దీపాన్ని విధి ఆర్పేసింది. విద్యార్థిని రైలు ప్రమాదం రూపంలో తనతో పాటు తీసుకెళ్లి తల్లిదండ్రులను కన్నీటి సంద్రంలో ముంచేసింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పూతికపేట గ్రామానికి చెందిన శీల సాయి (14) పుట్టుకతోనే బధిరుడు. తల్లిదండ్రులు సాయిని కొన్నాళ్లుగా నెల్లిమర్లలోని భవిత కేంద్రానికి పంపిస్తున్నారు. మంగళవారం తోటి విద్యార్థి శంకరరావుతో కలిసి విజయనగరంలో నిర్వహిస్తున్న ప్రత్యేకావసరాల  చిన్నారుల ఆటల పోటీలకు వెళ్లాడు.

వీరిని భవిత కేంద్రం ఉపాధ్యాయుడు బుచ్చిరాజు తీసుకెళ్లారు. ఆటల పోటీలు ముగిసిన తరువాత ఉపాధ్యాయుడు బుచ్చిరాజు ఇద్దరు విద్యార్థులను ఆటో ఎక్కించి, ఇళ్లకు వెళ్లిపొమ్మన్నారు. అయితే మండల పరిషత్‌ ప్రాంగణంలోని భవిత కేంద్రంలో ఉన్న సైకిలు తెచ్చుకునేందుకు ఆర్వోబీ సమీపంలో ఉన్న రైల్వేట్రాక్‌ దాటుతుండగా సాయిని రైలు ఢీకొట్టింది. తోటి విద్యార్థి శంకరరావు మాత్రం పట్టాలు దాటకుండా ఆగిపోయాడు. రైలు వస్తున్న శబ్ధం వినబడకపోవడంతోనే సాయి పట్టాలపైకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అందరూ అనుకుంటున్నారు. విషయం తెలుసుకున్న భవిత కేంద్రం ఉపాధ్యాయుడు బెల్లాన అప్పలనాయుడు, సీఆర్పీ వెంకటరమణ హుటాహుటిన సమీపంలో ఉన్న మిమ్స్‌ ఆస్పత్రికి సాయిని తీసుకెల్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయి తల్లిదండ్రులతో పాటు ఎంఈఓ అంబళ్ల కృష్ణారావు, ఎమ్మార్సీ సిబ్బంది శ్రీనివాస్, భవిత విద్యార్థులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. నిత్యం తమ మధ్యనే తిరుగాడే చిన్నారి విగతజీవిగా మారడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రైల్వేపోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు