ఉపాధ్యాయుడిపై కత్తితో యువకుడి దాడి

23 Jul, 2019 12:05 IST|Sakshi
యువకుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి

టీచర్‌కు నాలుగు కత్తిపోట్లు

యువకుడి చేతికి గాయాలు

పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయిన యువకుడు

సాక్షి, రాజోలు (తూర్పు గోదావరి): చీటికీ మాటికీ తనను అవహేళనగా మాట్లాడుతున్న ఉపాధ్యాయుడిపై ఒక యువకుడి కత్తితో దాడి చేశాడు. రాజోలు తోరం వారి వీధిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు బుడితి నాగ కోట సత్యనారాయణమూర్తిపై సోమవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన యువకుడు నల్లి విన్సెంట్‌ కత్తితో దాడి చేశాడు. ఉపాధ్యాయుడికి వీపుపై రెండు, ఛాతీపై రెండు మొత్తం నాలుగు చోట్ల కత్తిపోట్లు దిగాయి. దీంతో దాడి జరిగిన ప్రాంతమంతా రక్తపు మడుగుగా మారింది. గాయాలతో కిందపడి ఉన్న ఉపాధ్యాయుడిని స్థానికులు రాజోలులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

కత్తితో దాడికి పాల్పడిన యువకుడు రాజోలు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. యువకుడి చేతికి కూడా గాయం కావడంతో బంధువులు రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు మలికిపురం మండలం గుడిమెళ్లంక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ భార్య, కుమార్తెతో కలిసి రాజోలులోని తోరం వారి వీధిలో నివాసం ఉంటున్నాడు. అదే వీధిలో పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న పాస్టర్‌ నల్లి విక్టర్‌బాబు కుమారుడు విన్సెంట్‌.  విన్సెంట్,  ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి గత కొంతకాలంగా మాటామాటా అనుకుంటున్నారని స్థానికులు తెలిపారు.

చీటికీమాటికీ తనను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడని అందుకే దాడికి పాల్పడినట్టు యువకుడు విన్సెంట్‌ తెలిపాడు. రోడ్డుపై వెళ్తుండగా ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి తనను పిలిచి కత్తి చూపించి బెదిరించాడని, దీంతో కోపం వచ్చి ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని వివరించాడు. ఈ పెనుగులాటలో ఉపాధ్యాయుడిపై కత్తితో దాడికి పాల్పడినట్టు తెలిపాడు. ఈ క్రమంలో విన్సెంట్‌ చేతికి కూడా కత్తి గుచ్చుకుని గాయమైంది. రాజోలు ఎస్సై ఎస్‌.శంకర్‌ మాట్లాడుతూ గాయపడ్డ ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తిని అమలాపురం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని, ఉపాధ్యాయుడి వాగ్మూలం నమోదు చేసుకునేందుకు సిబ్బంది వెళ్లారన్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు