తండ్రీకొడుకుల అనూహ్య మరణం!

27 Jun, 2020 16:50 IST|Sakshi

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన తమిళనాడు ఘటన

చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్‌(59), బెనిక్స్‌(31) పోలీసు కస్టడీలో ఒకరి తర్వాత ఒకరు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్న వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్న కారణాలు, రిమాండ్‌కు తరలించే క్రమంలో వ్యవహరించిన విధానంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దాష్టీకానికి అమాయకులు బలయ్యారంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతకుమందు జయరాజ్‌, బెనిక్స్‌లను కోవిల్‌ పట్టి సబ్‌ జైలులో పరీక్షించిన వైద్యులు ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఆగ్రహ జ్వాలలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. అనుమతించిన సమయానికి మించి మొబైల్‌ షాపు తెరిచే ఉంచారన్న కారణంతో జయరాజ్, బెనిక్స్‌‌ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని కోవిల్‌ పట్టి మెజిస్ట్రేట్‌ ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. (‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’)

ముఖాలు పాలిపోయి..
ఈ క్రమంలో సోమవారం ఉదయం సబ్‌ జైలు వద్ద తండ్రీకొడుకులను వైద్యులు పరీక్షించారు. అయితే, తమ దగ్గరికి వచ్చే ముందే తండ్రీకొడుకులిద్దరి వెన్ను భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని, వారి ముఖాలు కూడా పాలిపోయి ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ ఇద్దరూ తమ సెల్‌ నుంచి డాక్టర్‌ రూం వద్దకు నడిచే వచ్చారని చెప్పారు. ఆ సమయంలో ఫినిక్స్‌ మోకాలు ఒకటి బాగా ఉబ్బిపోయిందని చెప్పారు. జయరాజ్, బెనిక్స్‌లను కస్టడీలోకి తీసుకునే ముందు సత్తాన్‌కులం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను పరిశీలించగా... అందులో కూడా వారి ఒంటిపై గాయాలు ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు.  (‘సెల్‌’ కోసమే దాష్టీకమా?)

ఒకరు బీపీ, మరొకరు షుగర్‌ పేషెంట్‌
ఇక జయరాజ్‌ డయాబెటిస్‌తో, బెనిక్స్‌ హైపర్‌టెన్షన్‌తో బాధ పడుతున్నారని వారికి కొన్ని యాంటీ బయోటిక్స్‌ వాడాల్సిందిగా పోలీసులకు సూచించారు. అంతేకాదు జయరాజ్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను సమీపంలో ఉన్న జనరల్‌ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని అధికారులకు చెప్పారు. వారిద్దరి గాయాలకు డ్రెస్సింగ్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ అదే రోజు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో బెనిక్స్‌ ఆరోగ్యం క్షీణించిందని జైలు నుంచి సదరు డాక్టర్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. బెనిక్స్‌ ఒళ్లంతా చెమటతో తడిసిపోయిందని.. దడగా ఉందని చెబుతున్నాడని ఓ అధికారి డాక్టర్‌కు వివరించారు. దాంతో అతడిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే బెనిక్స్‌ మరణించాడనే వార్త జైలు అధికారులకు అందింది.

ఇక అదే సమయంలో జయరాజ్‌ ఆరోగ్యం కూడా క్షీణించడం, విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలో మంగళవారం ఐదున్నర గంటల సమయంలో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడిన జయరాజ్‌ కూడా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే చనిపోవడానికి ముందు, అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ బెనిక్స్‌ తనంతట తానే నడిచి వచ్చాడని అధికారులు చెప్పడం గమనార్హం. కాగా కస్టోడియల్‌ డెత్‌‌పై తీవ్రంగా స్పందించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనపై మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు