టీడీపీ నేతల దాష్టీకం

1 May, 2018 10:52 IST|Sakshi

మహిళను బయటకీడ్చి..ఇంటికి తాళం

పసిబిడ్డకు పాలడబ్బాకూడా ఇవ్వని దారుణం

ఏడుగురిపై కేసు నమోదు

పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల దాష్టీకాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇలాకా లో బడుగులపై టీడీపీ నాయకుల ప్రతా పం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారు. తాజాగా పెందుర్తి మండలం పినగాడిలో ఓ పేద కుటుంబంపై టీడీపీ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని మగవారిపై ఉన్న కోపాన్ని మహిళలపై చూపిస్తూ తమ అధికారమదాన్ని ప్రదర్శించారు. ఇంట్లో సామాగ్రి బయట పడేసి ఇంటికి తాళం వేసి మరీ వీరంగమాడారు. ఇంట్లో ఉండిపోయిన పాలడబ్బాను సైతం పసిపిల్లాడికి ఇవ్వకుండా రాక్షసత్వం చూపించారు. ఆ పేద కుటుంబానికి దాదాపు ఆరు గంటల సేపు నరకం చూపించారు. చివరకు బాధితులు తెగించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏడుగురు టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశా రు.

వివరాల్లోకి వెళ్తే... గ్రామంలో ఆతవ దేముడు, రమణమ్మ దంపతులకు సురేష్‌ కుమారుడు. సురేష్‌ గ్రామంలోనే సెలూన్‌ పెట్టుకుని కులవృత్తి చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని శివాలయంలో భక్తులకు తలనీలాలు తీసే పని నిమిత్తం ఈవోను కలిసేందుకు ఈ నెల 27న సురేష్‌ ఆలయం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు వెన్నెల పెంటబాబు, మరికొందరు టీడీపీ నాయకులు సురేష్‌ను ఆ పని చేపట్టవద్దంటూ దుర్బాషలాడుతూ బెదిరించారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగిన సురేష్‌ విషయాన్ని తండ్రి దేముడుకు చెప్పాడు. ఇది మనసులో పెట్టుకున్న దేముడు ఆదివారం సాయంత్రం పెంటబాబు గ్రామంలో కనిపిస్తే తన కుమారుడిని ఎందుకు దుర్బాషలాడారు అని అడిగాడు.

దీంతో ఆగ్రహానికి గురైన పెంటబాబు దేముడుపై కూడా తిట్లదండకం మొదలుపెట్టాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తిరిగి పెంటబాబు తన అనుచరులతో దేముడు ఇంటికి వచ్చి ఇళ్లు సహా సురేష్‌ నిర్వహిస్తున్న సెలూన్‌లోని సామాగ్రి బయట పడేసి తాళాలు వేశారు. దాదాపు ఆరుగంటల సేపు బాధితులు రోడ్డుపైనే ఉండిపోయారు. ఆ సమయంలో సురేష్‌ కుమారుడు(రెండేళ్లు)కి పాలడబ్బా కూడా తీసుకోకుండా టీడీపీ నాయకులు  ప్రవర్తించారని సురేష్‌ భార్య పావని ఆవేదన వ్యక్తం చేసింది. చేసేది లేక బాధితులంతా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ నాయకుల వద్ద ఉన్న తాళాలను తీసుకుని బాధితులకు ఇచ్చారు. నిందితులు వెన్నెల పెంటబాబు, వెన్నెల భానుసాగర్, వెన్నెల పృద్వీరాజ్, వెన్నెల సురేష్, వెన్నెల గోవింద్, కచ్చాల విష్ణు, పోతల సోమునాయులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఆతవ పావని ఫిర్యాదు మేరకు కేసు సోమవారం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. 

మరిన్ని వార్తలు