మూతపడి 30 ఏళ్లు

1 May, 2018 10:47 IST|Sakshi

వీవింగ్‌ మిల్లు లాకౌట్‌

మేడే రోజున రోడ్డున పడ్డ కుటుంబాలు

ఇప్పటికే 134 మంది కార్మికులు మృతి

రామగుండం : అంతర్గాం వీవింగ్‌ మిల్లు 1987 మే ఒకటవ తేదీన లాకౌట్‌గా ప్రకటించి మంగళవారం నాటికి (మేడే) ముప్‌పై ఏళ్లు పూర్తయింది. బర్మా, శ్రీలంక, కాందీశీకుల శాశ్వత పునరావాస కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 1967న కేంద్ర, రాష్ట్ర (అప్పటి ఆంధ్రప్రదేశ్‌) ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు అవకాశం కల్పించింది. అంతర్గాంలో టెక్స్‌టైల్‌ టౌన్‌షిప్‌ (టీటీఎస్‌) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

ఇందుకు గాను 502 ఎకరాల భూ విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ పునరావాస ఆర్థిక నిధులు రూ.1.05 కోట్లతో దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ సహకార రంగంలో టెక్స్‌ౖటైల్‌ సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో జూలై 7, 1971న స్థానిక, స్థానికేతర 509 మంది కార్మికులతో టెక్స్‌టైల్‌ వీవింగ్‌ మిల్లు సొసైటీగా రూపాంతరం చెందింది. ఇందులో కార్మికులు విధులు నిర్వహిస్తూ 1976 వరకు లాభాల బాటలో పయనించిన వీవింగ్‌ సొసైటీ క్రమంగా నష్టాల బాటన పడింది.

దీనికి కారణం యాజమాన్యం అవినీతి, పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల బాటలోకి చేరింది. అప్పటికే పలుమార్లు, లేఆఫ్, లాకౌట్లను ప్రకటించిన యాజమాన్యం కార్మికుల ఆందోళనలతో నెట్టుకురాగా కొంతకాలం తర్వాత ప్రభుత్వం ముడిసరుకు లేదనే సాకుతో 1987 మే (మేడే) ఒకటిన శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లాకౌట్‌ను ప్రకటిస్తున్నట్లు 1987 మే డే రోజున రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్‌ రాజ్‌భవన్‌ సాక్షిగా ఆమోదముద్ర వేయడం కార్మిక చట్టాలను అపహస్యం చేయడమేనని కార్మిక లోకం గళమెత్తింది. 

1987 నుంచి ప్రారంభమైన ఆకలి చావులు...

1987 మేడే రోజున మూతపడిన వీవింగ్‌ మిల్లు కార్మికులకు అప్పటికే రెండేళ్ల నుంచి వేతనాలు సకాలంలో చెల్లించకపోగా, పలువురు కార్మికులు అప్పటికే అనారోగ్యం బారినపడ్డారు. ఎక్కువగా దూదిలో నుంచి వచ్చే ధూళి కణాలతో ఊపిరితిత్తుల వ్యాధులకు ఎక్కువగా గురయ్యేవారు. 1987 అక్టోబర్‌లో వెలగాల మహాలక్ష్మి అనే కార్మికురాలు ఆకలిచావుతో మతి చెందడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆనాటి నుంచి నేటి వరకు 134 మంది కార్మికులు తమకు రావాల్సిన బకాయిలు స్వీకరించకుండానే మృతిచెందారు.

కార్మికులకు అందని బకాయిలు..

వీవింగ్‌ మిల్లు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో ప్రభుత్వం కూడా కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించలేని స్థితిలోకి చేరింది. ఈ క్రమంలో వీవింగ్‌ మిల్లును తుక్కు కింద విక్రయించి వచ్చిన నగదును కార్మికులకు చెల్లించేందుకు జాయింట్‌ కలెక్టర్‌కు లిక్విడేటర్‌ హోదాను అప్పగించింది. అప్పటి నుంచి నేటి వరకు 18 మంది లిక్విడేటర్లు మారినప్పటికీ కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈపీఎఫ్, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ మాత్రం అందలేదు.

శాశ్వత పునరావాస కల్పనకు శ్రీలంక, బర్మా దేశాల నుంచి వచ్చిన తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డున పడేశాయని పలుమార్లు నిరాహార దీక్షలు సైతం చేశాయి. ఇందుకు కనీసం తమకు నివేశన స్థలాల కింద ఇప్పుడున్న క్వార్టర్‌తో కలుపుకొని పది గుంటల స్థలం తమ పేరుతో పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం సొసైటీకి చెందిన భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. 

సొసైటీ భూముల్లో పరిశ్రమ స్థాపించాలి...

అంతర్గాం సొసైటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వాటిని ప్రభుత్వం సర్వే చేయించి అన్యాక్రాంతమైన భూములను గుర్తించి హద్దు రాళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పాటుపడాలి.  –  రామారావు, కాందీశీకుల సంఘం ప్రతినిధి

జీవితాన్ని నాశనం చేసుకున్నాం...

నేను, నా భర్త అప్పారావు కలిసి వీవింగ్‌ మిల్లులో కార్మికులుగా చేరాం. భర్త 1998లో టీబీ వ్యాధితో మృతిచెందాడు. ఇప్పుడు నేను దంత క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. వీవింగ్‌ మిల్లుల్లో పని చేయడంతోనే తమ బతుకులు చావుబారిన పడ్డాం. మిల్లు మూతపడే నాటికే నా భర్తకు రూ.57,004 తనకు రూ.56,692 బకాయిలు రావాల్సి ఉంది.  – కర్రి పద్మ, వీవింగ్‌ మిల్లు కార్మికురాలు.

మరిన్ని వార్తలు