తృటిలో తప్పిన పెను ప్రమాదం

16 Jun, 2018 06:56 IST|Sakshi
15 మంది చిన్నారులను కాపాడిన స్కూల్‌ టీచర్‌ రాజేశ్వరి ,విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ తగిలి కాలిపోయిన స్కూల్‌ బస్సు

ప్రైవేటు స్కూల్‌ బస్సుకు విద్యుదాఘాతం

బస్సులో 15 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు

విద్యార్థుల ప్రాణాలు కాపాడిన రాజేశ్వరి టీచర్‌

తూర్పుగోదావరి ,భీమక్రోసుపాలెం (రామచంద్రపురం): రామచంద్రపురం మండలం అన్నాయిపేటలోని లక్ష్మీ శర్వాణీ హైస్కూల్‌ బస్సు శుక్రవారం విద్యుదాఘాతానికి గురై కాలిపోయింది. ప్రమాద సమయంలో 15 మంది ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్కూలు బస్సు ఎప్పటిలాగానే ఉదయం సుమారు 7 గంటలకు కాజులూరు మండలం అండ్రంగిలోను, కె.గంగవరం మండలం అద్దంపల్లి, వట్రపూడి గ్రామాల్లోను విద్యార్థులను ఎక్కించుకుని భీమక్రోసుపాలెం గ్రామానికి చేరుకుంది. భీమక్రోసుపాలెంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మలుపు తీసుకుని గ్రామంలోని మరో 20 మంది విద్యార్థులను ఎక్కించుకోవలసి ఉండగా డ్రైవర్‌ అజాగ్రత్త వల్ల రోడ్డు పక్కన గల విద్యుత్‌ స్తంభానికి అమర్చిన సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను రాసుకుంటూ వెళ్లింది.

దీనితో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి పెద్దగా శబ్దాలు, మెరుపులు రావడంతో బస్సులో ఉన్న టీచర్‌ విశ్వనాథం రాజేశ్వరి అప్రమత్తమై మరో టీచర్‌ శలా మోహన సత్యలక్ష్మి సహకారంతో సెకన్ల వ్యవధిలో విద్యార్థులను బస్సు నుంచి దించేశారు. విద్యార్థులలో ఆ టీచర్‌ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆ తరువాత బస్సును మళ్లీ వెనక్కి తీయాలని డ్రైవర్‌ ప్రయత్నించగా మరింతగా శబ్దాలతో మంటలు చెలరేగాయి. దీనితో బస్సులో సీట్లు, విద్యార్థుల పుస్తకాలు, వారు తెచ్చుకున్న భోజనం క్యారేజ్‌లతో సహా కాలిబూడిదయ్యాయి. స్థానికులు కూడా సకాలంలో స్పందించి విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేసి బకెట్లతో నీరు వేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్క విద్యార్థికి చిన్న గాయం కూడా కాకుండా కాపాడిన టీచర్‌ రాజేశ్వరిని అందరూ అభినందించారు. ఫైర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.నాగేంద్రప్రసాద్‌ తన సిబ్బందితో వచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద బాధితులు లేరని, సుమారు రూ.5 లక్షలు నష్టం ఉంటుందని ఫైర్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. రామచంద్రపురం సీఐ కొమ్ము శ్రీధర్‌కుమార్‌ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.

కొత్త డ్రైవర్‌ కావడంతోనే ప్రమాదం
ఈ బస్సు డ్రైవర్‌ పిల్లి విజయకుమార్‌ తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి ఆసుపత్రికి వెళతానని సెలవు పెట్టడంతో కొత్త డ్రైవర్‌ బస్సు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు అంటున్నారు. విజయకుమార్‌ ఎప్పుడూ ఎంతో మెళకువగా బస్సు మలుపు తిప్పేవాడని, కొత్త డ్రైవర్‌ అజాగ్రత్తగా బస్సును నడిపి విద్యుత్‌ స్తంభంపై సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను రాసుకుంటూ వెళ్లడం వల్లనే ప్రమాదం సంభవించిందని అంటున్నారు. కాగా ద్రాక్షారామ పోలీసులురెగ్యులర్‌ డ్రైవర్‌ పిల్లి విజయకుమార్‌ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు