నాగజ్యోతి హత్య కేసులో ముగిసిన అరెస్టులు

14 Jul, 2018 08:26 IST|Sakshi
జితేంద్ర అరెస్టు చూపుతున్న పోలీసులు(ఫైల్‌)

మొత్తం పది మంది నిందితుల అరెస్టు

ఆస్తి కోసమే భార్యను హత్యచేయించిన భర్త

మదనపల్లె క్రైం : అప్పుల ఊబి నుంచి బయట పడడానికి భార్య ఆస్తిపై కన్నేసిన భర్త ఆమెను కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించాడు. ఎస్‌బీఐ కాలనీకి చెందిన ప్రముఖ లాయర్‌ జితేంద్ర భార్య నాగజ్యోతి మే నెల 30న మదనపల్లెలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం పది మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టి మృతురాలి భర్త సహా 9 మంది నిందితులను అరెస్టు చేశారు. హత్యలో ప్రధాన పాత్ర పోషించి తప్పించుకు తిరుగుతున్న ఏ–4 నిందితుడు నిమ్మనపల్లె మండలం ముష్ఠూరుకు క్రాస్‌కు చెందిన మాజీ సర్పంచి ఉల్లి లక్ష్మన్న కుమారుడు ఉల్లి ఆనంద్‌ (30)ను గురువారం మదనపల్లె మండలం బసినికొండ రామాచార్లపల్లె వద్ద టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్‌ సీఐ సురేష్‌కుమార్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మే నెల 30వ తేదీన స్థానిక ఎస్‌బీఐ కాలనీ వద్ద ప్రముఖ న్యాయవాది నాగజ్యోతి(40) హత్యకు గురైందన్నారు. ఘటనా స్థలంలో లభించిన కీలక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేసి హత్య వెనుక భర్త హస్తం ఉందని గుర్తించామని పేర్కొన్నారు.

అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అనేక విషయాలు తెలిశాయన్నారు. జూన్‌ 12న జితేంద్రను అరెస్టు చేసి అతను ఇచ్చిన సమాచారంతో హత్యకు పాల్పడింది గతంలో హత్యలు చేసిన పాత నేరస్తులేనని నిర్ధారణకు వచ్చామన్నారు. జూన్‌ 12న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. జూన్‌ 26న మరో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ప్రధాన నిందితుడైన ఉల్లి ఆనంద్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అతను మదనపల్లె మండలం బసినికొండ రామాచార్లపల్లె వద్ద ఉండగా గురువారం అరెస్టు చేశామన్నారు. నిందితుల్లో సగం మంది పాత నేరస్తులు ఉన్నారని వివరించారు. వారిలో బి.కొత్తకోట మండలం బందార్లపల్లెకు చెందిన చల్లా వెంకటేష్‌ అలియాస్‌ మహేష్‌(28), పీలేరు మండలం జాండ్లకు చెందిన నెల్లూరి హేమంత్‌ (22), మూడే శేఖర్‌నాయక్‌(23), పులిచర్ల మండలం కల్లూరుకు చెందిన మూర్తూరు షేక్‌ హుసేన్‌ అలియాస్‌ సద్దాం హుసేన్‌(22), షేక్‌ అస్లాంబాషా(25), దూదేకుల తన్వీర్‌(20), పట్టణంలోని అనపగుట్టకు చెందిన సాయి కిరణ్‌కుమార్‌రెడ్డి(30), గుర్రంకొండ కొత్తపేట వీధికి చెందిన సుంకర రాము(30), నిమ్మనపల్లె మండలం ముష్ఠూరు క్రాస్‌కు చెందిన ఉల్లి ఆనంద్‌(30) హాత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నాగజ్యోతి భర్త లాయర్‌ జితేంద్ర(48)ఉన్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు