చోర దంపతుల రిమాండ్‌

1 Feb, 2019 10:40 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వర్‌రావు

చాంద్రాయణగుట్ట: విలాసవంతమైన జీవనం కోసం చోరీల బాట పట్టిన భార్యాభర్తలను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షాహిన్‌నగర్‌కు చెందిన నసీం ఫాతిమా, షేక్‌ మహ్మద్‌ ఆబిద్‌ షరీఫ్‌ అలియాస్‌ బాబుజానీ భార్యభర్తలు. చెడు అలవాట్లకు బానిసైన వీరు సులభంగా డబ్బులు సంపాదించేందుకు చోరీలకు పాల్పడుతున్నారు. ఇళల్లో కిటికీల వద్ద చార్జింగ్‌ కోసం ఉంచిన సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు, ఫంక్షన్‌హాళ్లలో  బ్యాగ్‌లను ఎత్తుకెళ్లేవారు. నిర్మానుష్య ప్రాంతాల్లోని ఇళ్లను ఎంచుకునే వీరు షరీఫ్‌ కాపలా కాస్తుండగా ఫాతిమా చోరీ లకు పాల్పడేది.

చాంద్రాయణగుట్టలో ఆరు, హుస్సేనీఆలంలో ఒక చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం చాంద్రాయణగుట్ట పోలీసులు బార్కాస్‌ ఫీలీ దర్గా వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా వీరిపై అనుమానంతో ఆపేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని సోదా చేయగా బంగారం, నగదు లభ్యమైంది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరాలు అంగీకరించారు. వారి నుంచి 13 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.27 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సైలు కొండల్‌ రావు, శివతేజ, వెంకటేశం, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు