మత్తుపై ఆశ.. మృత్యు ఘోష!

25 Feb, 2019 07:28 IST|Sakshi
కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున నుంచి బాధితుల వివరాలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌

అభాగ్యుల ఉసురు తీసిన విష రసాయనం

పెదగంట్యాడలోని స్వతంత్ర నగర్‌లో విషాదం

చిత్తు కాగితాలు ఏరుకునే వారిని కాటేసిన విషం

డంపింగ్‌యార్డులో రసాయనంతో ఉన్న క్యాన్‌ లభ్యం

మత్తు పదార్థమన్న ఆశతో తాగిన కాలనీ వాసులు

ముగ్గురు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

కేజీహెచ్‌లో 11 మందికి చికిత్స

మత్తు కోసం ఆశపడ్డ బడుగు జీవుల బతుకులను విష రసాయనంహాలాహలంలా దహించింది. చిత్తు కాగితాలేరుకుంటూ జీవితాన్నినడిపించే చిన్న బతుకులకు చేజిక్కిన ‘ద్రవం’ అనుకోని తీరులో విపత్తు
సృష్టించింది. పెద గంట్యాడ స్వతంత్ర నగర్‌ కాలనీలో ఆదివారంవిషాదం కాలువకట్టి మరీ ప్రవహించింది. దొరికినదో, ఎవరిచ్చినదోకానీ.. ఆ అభాగ్యులకు దక్కిన ద్రవ పదార్థం ముగ్గురి ఆయుర్దాయాన్నిహరించింది. చేజిక్కిందే చాలని సంబరపడి, అదేమిటో కూడాతెలియకుండా గొంతు తడిచేసుకున్న అమాయక జీవులకు చివరికిఆపద సంప్రాప్తించింది. అనుకోకుండా దొరికిన క్యాన్‌లో ద్రవం చివరికికాలకూట విషమై.. బతుకులను కాల్చేసింది.మరో ఎనిమిది మందికి ప్రత్యక్ష నరకాన్ని చూపించింది.

సాక్షి, విశాఖపట్నం/గాజువాక: తెల్లారి లేచింది మొదలు చీకటి పడే వరకు వారికి ఒకటే తపన. ఎవరికీ అక్కర్లేని చెత్త, చెదారాన్ని వారు అక్కున చేర్చుకుంటారు. దానిపై వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాము చేపట్టిన వృత్తి దుర్భరమని తెలిసినా అందులోనే నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. రోజంతా పడ్డ శ్రమకు మత్తు నుంచి ఉపశమనం లభిస్తుందని తాగుడుకు అలవాటు పడ్డారు. ఆ అలవాటే ముగ్గురిని బలితీసుకుంది. మరికొందరిని చావుబతుకుల్లోకి నెట్టేసింది.   పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్‌ ఎస్టీ కాలనీలో చోటు చేసుకున్న విషాదం వెనక మత్తు ఉండడం.. మృతుల్లో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉండడం మరింత కలచివేసింది. ఎస్టీ కాలనీలో సంచార జాతుల తెగకు చెందిన కుటుంబాలు అధిక శాతం నివసిస్తున్నాయి. పురుషులు చిన్న చిన్న కూలిపనులు, పందుల పెంకపం వ్యాపకంగాను, మహిళలు చెత్తల్లోనుంచి విక్రయానికి ఉపయోగపడే వ్యర్థాలను సేకరిస్తుంటారు. ఈ తెగలో పురుషులతో పాటు మహిళలు కూడా మద్యం సేవిస్తుంటారు. శనివారం సాయంత్రం కాలనీకి సమీపంలో ఉన్న జీవీఎంసీ డంపింగ్‌ యార్డులో వ్యర్థాల సేకరణకు కోసం వెళ్లిన వాడపల్లి అంకమ్మకు అక్కడికి సమీపంలోనే పది లీటర్ల క్యాన్‌తో ఒక రకమైన రసాయన ద్రావకం దొరికింది.

దాన్ని ఇంటికి తీసుకొచ్చిన ఆమె అందులో ఉన్నది సారా అని భావించింది. చాలా కాలం క్రితం ఈ కాలనీవాసులు నాటుసారా తెచ్చుకొని సేవించేవారు. దీంతో ఈ ద్రావకం కూడా సారా అని, దాన్ని ఎవరో అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని భావించింది. ఆ ద్రావకాన్ని శనివారం రాత్రే కాలనీలో ఉన్న తమ బంధువులు, పక్కవాళ్లకు పంచింది. సుమారు 20 మంది దానిని సేవించారు. ఆదివారం నిద్ర లేచే సమయానికి వారందరికీ కడుపులో మంట మొదలైంది. కొందరికి వాంతులయ్యాయి. రాత్రి తాగిన సారాలో పవర్‌ ఎక్కువగా ఉండి ఉంటుందని వారు భావించారు. వారిలో పెండ్ర అప్పలమ్మ(65) మంచంపై నుంచి లేవలేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు పిలిచినా ఆమె సరిగా స్పందించకపోవడంతో మత్తు ఎక్కువై ఉంటుందని, అప్పటికే తమ ఇంట్లో ఉన్న మద్యాన్ని కూడా సేవించి ఉంటుందని భావించారు. చివరకు ఉదయం 10 గంటలు దాటినా ఆమె నుంచి చలనం లేకపోవడంతో మృతి చెందిందని నిర్ధారించి దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. మద్యం తాగడం ఆమె చివరి కోరిక అయి ఉండవచ్చని, ఇప్పుడు సారా(రసాయనం) తాగడంతో కోరిక తీరి మృతి చెందిందని భావించారు. ఈ క్రియ ముగిసేలోగా ఆమె సోదరుడు వాడపల్లి అప్పడు(50), ఆ కాలనీకి చెందిన ఆసనాల కొండోడు(64) కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయనదీ రాత్రి తాగిన మద్యం(కెమికల్‌) ప్రభావమేననుకున్నారు. మరో కొద్ది సేపటికి అప్పడు పెద్ద కోడలు వాడపల్లి అంకమ్మ కూడా అస్వస్థతకు గురై వాంతులు కూడా అయ్యాయి. వాంతి నుంచి బయటకు వచ్చిన కెమికల్‌ పడ్డ నేల నల్లటి పొగ మాదిరిగా మారిపోవడంతో ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స మొదలైన కొద్దిసేపటికి ఆమె మామ వాడపల్లి అప్పడు(50), ఆసనాల కొండోడు (64) చనిపోయారు. వీరితో పాటు అస్వస్థకు గురైన 11 మందిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో రమణమ్మ, చిన్నారావు, అంకమ్మల  పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

విచారణ చేపట్టిన పోలీసులు
ఈ సంఘటనతో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఎస్టీ కాలనీలో పర్యటించారు. మృతులు, బాధితులు సేకరించిన కెమికల్‌పై ఆరా తీశారు. పది లీటర్ల క్యాన్‌తో ఉన్న రసాయన ద్రావకంలో ప్రస్తుతం మూడు లీటర్లే మిగిలి ఉందని, ఏడు లీటర్ల ద్రావకాన్ని 11 మంది సేవించారని సౌత్‌ ఏసీపీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. బాధితులు సేవించింది మద్యం కాదని, ఉడ్‌ బర్నింగ్‌కు ఉపయోగించే కెమికల్‌ అయి ఉంటుందని అసిస్టెంట్‌ ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.ప్రసాద్‌ తెలిపారు. పూర్తి స్థాయి నివేదిక సోమవారం వస్తుందని చెప్పారు. గాజువాక సీఐ కె.రామారావు, గాజువాక ఎక్సైజ్‌ సీఐ ఉపేంద్ర, గాజువాక పీహెచ్‌సీ వైద్యాధికారి తమ సిబ్బందితో సహా కాలనీలో పర్యటించి సంఘటకు గల కారణాలపై విచారణ  చేపట్టారు. 

ప్రజా ప్రతినిధులు, నాయకుల పరామర్శ
ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఈ కాలనీలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సంఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్‌సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, నాయకులు కటికల కల్పన, గండ్రెడ్డి రామునాయుడు, ఈగలపాటి యువశ్రీ, మాజీ కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు, రుషీ సేవా సంస్థ అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు మంత్రి శంకరనారాయణరావు, జెర్రి పోతుల ముత్యాలు తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఉద్యోగం, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
ఎస్టీ కాలనీలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. కాలనీని ఆనుకొని జీవీఎంసీ డంపింగ్‌ యార్డు కొనసాగడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. డంపింగ్‌ యార్డును కొనసాగించాలని స్థానిక కాలనీల ప్రజలు ఏళ్ల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం పెడచెవినపెట్టిందన్నారు. డంపింగ్‌ యార్డు కాలనీ పక్కన ఉండటంవల్లే ఈ ద్రావకం లభించడానికి కారణమైందన్నారు.

కేజీహెచ్‌లో ఆర్తనాదాలు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): గాజువాక స్వంతంత్రనగర్‌లో నాటుసారా అని భ్రమపడి పరిశ్రమల్లో వాడే రసాయనాన్ని తాగి అస్వస్థతకు గురైన బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితులు, బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి మిన్నంటింది. ద్రవాన్ని తాగిన సుమారు 20 మందిలో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు ద్రవం తాగిన మిగతా 11 మందిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఆసనాల కొండయ్య(60) మార్గమధ్యలో చనిపోయాడు. ఆసనాల చిన్న(58), ఆసనాల రమణమ్మ(59) పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మిగతా ఎనిమిది మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్‌ అధికారులతో ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులు తాగింది మద్యం కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పరిశ్రమల్లో వాడే రసాయనంగా అనుమానిస్తున్నామని, పరీక్ష నిమిత్తం ద్రవాన్ని ల్యాబ్‌కు పంపామని, సోమవారం ఉదయానికి పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పారు.

కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న వారి వివరాలు
1.ఎ.ఎర్రొడు (50)
2.ఎ.అప్పన్న (22)
3.ఎ.చినఅప్పన్న (25)
4.పి.చిన్న (32)
5.పి.చిన అప్పన్న (32)
6.ఎ.చిన్నారావు (58)..పరిస్థితి విషమం
7.ఎ.అప్పన్న (40)
8.ఎ.రమణమ్మ (59)..పరిస్థితి విషమం
9.ఎ.రమణమ్మ (55)
10.ఎ.దుర్గయ్య (31)   
11. అంకమ్మ(50) పరిస్థితి విషమం  

డంపింగ్‌ యార్డ్‌లో దొరికింది..
సుమారు 20 లీటర్లున్న క్యాన్‌ శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో డంపింగ్‌ యార్డ్‌లో దొరికింది. దాన్ని నాటుసారా అనుకుని సుమారు 20 మంది వరకూ తాగారు. అదే రోజు రాత్రి కూడా తాగిన ముగ్గురు చనిపోయారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. స్పిరిట్‌ కాదు. వాసన లేకపోవడంతో నాటుసారా అనుకునే మా వాళ్లంతా తాగారు.– ఆసనాల ఆనంద్,బాధిత కుటుంబానికి చెందిన యువకుడు

మరిన్ని వార్తలు