అడవి పంది రూపంలో  అడ్డొచ్చిన మృత్యువు

30 Mar, 2018 07:16 IST|Sakshi
బోల్తా పడిన తుఫాన్‌ వాహనం 

అడవి పంది అడ్డురావడంతో

అదుపు తప్పి వాహనం బోల్తా

ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు 

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన

మృతులంతా నిజామాబాద్‌ వాసులే..

ఉట్నూర్‌రూరల్‌(ఖానాపూర్‌) : పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అడ్డువచ్చిన అడవి పందిని తప్పించబోయి ఓ వాహనం బోల్తా పడడంతో ముగ్గురు చెందారు. 11 మంది గాయపడ్డారు. ఖానాపూర్‌ మండలం పులిమడుగు గ్రామపంచాయతీ పరిధి అందోలి గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ కడారి వినోద్‌ తెలిపిన వివరాలివీ.. కుమురంభీం జిల్లా జైనూర్‌ మండలం జంగాం గ్రామంలో ఓ ఇంట్లో ఈ నెల 26న పెళ్లి ఉండడంతో నిజామాబాద్‌కు చెందిన బంధువులు వెళ్లారు. 28న మహారాష్ట్ర కిన్వట్‌లో జరిగిన రిసెప్షన్‌కు కూడా హాజరై తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఖానాపూర్‌ మండలంలోని పులిమడుగు గ్రామపంచాయతీ పరిధి అందోలి గ్రామం వద్ద తుఫాన్‌ (ఏపీ33బి5900) వాహనానికి అడవి పంది అడ్డు రావడంతో తప్పించబోయి బోల్తా పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న నిజామాబాద్‌ జిల్లాకు చెందిన షేక్‌ సలీం (35), బాబు మియా (40) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన బోధన్‌ సాలూర గ్రామానికి చెందిన బాబు ఖురేషి (55)  ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గాయపడ్డ ఫర్హాన, రెహాన, గోరీబీ, షేక్‌ ఫరీన, మహిబూబ్‌బీ, అబ్దుల్‌ ఖాజీ, ఆబిదాబేగం, రుక్సాన్, డ్రైవర్‌ రబ్బానీ, ఘుడూతోపాటు అజీజ్‌లను 108లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలాన్ని సీఐ వినోద్‌ సందర్శించి మృతదేహాలను ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు పంపించారు. మృతుల బంధువైన అజీజ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబాల్లో అలుముకున్న విషాదం పెళ్లికి వెళ్లి అరగంట అయితే తమ ఇళ్లకు వెళ్తామనుకునే తరుణంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఇటు జంగాం బంధువుల ఇళ్లతోపాటు అటు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా మృతుల్లో షేక్‌ సలీం, బాబు ఖురేషీలు అన్నదమ్ముళ్లు. నిజామాబాద్‌ జిల్లా శాంతినగర్‌ కాలనీకి చెందిన వారు కాగా మేనమామ అయిన బాబుమియా బోధన్‌ మండలం సరూర్‌నగర్‌కు చెందిన వారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మండలవాసులు, బంధువులు ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

మరిన్ని వార్తలు