ఘోరం: ఒకేరోజు ముగ్గురి ఆత్మహత్య

26 May, 2020 09:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పాల్వంచ: వేర్వేరుచోట్ల ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పురుగుల మందు తాగి, ఒకరు ఉరి వేసుకుని మృతి చెందారు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి తన ఇంటికి రాకపోవడంతో భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన పాల్వంచలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రశాంత్‌ నగర్‌ కాలనీకి చెందిన జజ్జెర ప్రసాద్‌(30) మద్యానికి అలవాటు పడి కుటుంబ పోషణను పట్టించుకోవడంలేదు. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ప్రసాద్, భార్య సంధ్య పిల్లలతో కలిసి గొందిగూడెంలోని అత్తగారింటికి వెళ్లారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్రయల్స్‌పై నిషేధం)

కరోనా లాక్‌డౌన్‌తో రెండు నెలలపాటు అక్కడే ఉన్నారు. ఇటీవల ప్రసాద్‌ ఒక్కడే పాల్వంచ వచ్చాడు. భార్యను ఇంటికి రమ్మని పలుమార్లు కోరగా, నువ్వే వచ్చి తీసుకెళ్లాలని చెబుతూ వస్తోంది. దీంతో మనస్తాపంతో ఉన్న ప్రసాద్‌ మద్యం మత్తులో ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లి కమలమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు జజ్జెర రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అంతులేని వ్యథ.. లక్సెట్టిపేట వాసి విషాదగాథ )

చర్లలో పురుగుల మందు తాగి..
చర్ల: పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండల పరిధిలోని కలివేరులో సోమవారం చోటు చేసుకుంది. మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కలివేరు గ్రామానికి చెందిన పూనెం సతీష్‌ (22) భార్య, పిల్లలు దుమ్ముగూడెం మండలంలోని తన అత్తగారింటి వద్ద ఉన్నారు. సతీష్‌ ఆదివారం మద్యం చిత్తుగా తాగి తనకు బైక్‌ ఇవ్వాలని, తాను వెళ్లి భార్యాపిల్లలను చూసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పారు. మద్యం మత్తులో ఉన్నావని, రేపు వెళ్లవచ్చని తల్లిదండ్రులు వారించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంటి వెనుకకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి సత్యనారాయణపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి భద్రాచలం ఏరియావైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం )

పండుగ వేళ విషాదం
ఇల్లెందు: రంజాన్‌ పర్వదినం రోజు ఓ ముస్లిం కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎల్‌బీఎస్‌ నగర్‌లో నివాసం ఉంటున్న బాసిత్‌(35) ఎలక్ట్రీషియన్‌ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాసిత్, భార్య కరీమాల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. రంజాన్‌ పర్వదినం సందర్భంగా భార్య ఇంట్లో లేదని మనస్తాపం చెంది, ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు