కష్టపడలేక మోసాలు మొదలెట్టాడు!

29 Nov, 2018 09:37 IST|Sakshi

మెడికల్‌ రిప్‌గా పని చేయలేకపోయిన వైనం

ట్రావెల్‌ ఏజెంట్‌ అవతారం ఎత్తి మోసాలు

ఒకరి అరెస్టు, పరారీలో ఇద్దరు అనుచరులు

సాక్షి, సిటీబ్యూరో: బతుకుతెరువు కోసం మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా మారిన ఆ యువకుడు కష్టపడలేకపోయాడు... పెద్దగా ‘పని’ లేకుండా తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు... దీనికోసం ట్రావెల్‌ ఏజెంట్‌ అవతారం ఎత్తి మోసాలు మొదలెట్టాడు... మలేషియా సహా వివిధ దేశాల్లో ఉద్యోగాల పేరుతో లక్షల్లో దండుకున్నాడు... ఇద్దరు అనుచరులతో కలిసి ఇప్పటి వరకు 20 మందిని మోసం చేసిన ఈ ఘరానా మోసగాడిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌పై నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. ముషీరాబాద్‌లోని ఎస్సార్కే నగర్‌ కాలనీకి చెందిన మజీద్‌ అహ్మద్‌  విద్యాభ్యాసం తర్వాత మెడికల్‌ రిప్రజెంటేవివ్‌గా ఉద్యోగం ప్రారంభించాడు. ఆ వృత్తిలో ఉండే టార్గెట్లు, నిత్య సంచారం తట్టుకోలేకపోయాడు. అలా కష్టపడటం తన వల్ల కాదని భావించిన మజీద్‌ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. అప్పటికే ఇతగాడికి వీసా ప్రాసెసింగ్, ఇమ్మిగ్రేషన్‌ డాక్యుమెంటేషన్‌పై పట్టు ఉంది. దీన్ని  ఆసరాగా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయాలని భావించాడు.

దీనికోసం ట్రావెల్‌ ఏజెంట్‌గా అవతారం ఎత్తిన అతను రెయిన్‌బజార్‌కు చెందిన అసద్, గోల్కొండకు చెందిన మహమూద్‌లను సబ్‌–ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరిద్దరూ తమ తమ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు మలేషియాతో పాటు మరికొన్ని దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర వేస్తారు. ఆసక్తి చూపిన వారిని తీసుకువచ్చి మజీద్‌కు అప్పగిస్తారు. ఇతగాడు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసి కొన్నాళ్ల పాటు వీసా ప్రాసెసింగ్‌ జరుగుతోందని చెప్తాడు. ఆపై కొందరికి విజిట్‌ వీసా అంటగట్టి అక్కడకు పంపిస్తాడు. ఇలా మోసపోయిన అనేక మంది కొన్ని రోజులకే తిరిగి వచ్చేశారు. మరికొందరిని మలేషియా విమానాశ్రయంలో రిసీవ్‌ చేసుకునే అక్కడి మజీద్‌ ఏజెంట్లు వారి నుంచి పాస్‌పోర్ట్స్‌ స్వాధీనం చేసుకుని దారుణమైన ఉద్యోగాల్లో నియమిస్తారు. ఇలా చేరిన వారిలో చాలీచాలని జీతంతో పాటు చిన్న చిన్న విషయాలకే వేధింపులు, శిక్షలు ఎదుర్కొన్న వారు ఎందరో ఉన్నారు. అతి తక్కువ మంది మాత్రం ఇక్కడున్న తమ కుటుంబీకుల సాయంతో తిరిగి రాగలిగారు. వీరిపై రెయిన్‌బజార్, బంజారాహిల్స్, గోల్కొండ, లంగర్‌హౌస్‌ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మజీద్‌ కదలికలపై సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, టి.శ్రీధర్‌ వలపన్ని బుధవారం పట్టుకున్నారు. ఇతడిని రెయిన్‌బజార్‌ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు