శీలానికి వెలకట్టారని..

29 Oct, 2017 02:54 IST|Sakshi
కార్తీక్‌

     నిద్రమాత్రలు మింగి గిరిజన యువతి ఆత్మహత్యాయత్నం

     ప్రేమిస్తున్నానంటూ శారీరకంగా లోబర్చుకున్న కార్తీక్‌ 

     పెళ్లికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించిన యువతి 

     పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పిన పోలీసులు 

మహబూబాబాద్‌ రూరల్‌: ఓ గిరిజన యువతిని ఓ యువకుడు ఐదేళ్లుగా ప్రేమ పేరుతో వంచించి.. శారీరకంగా లోబర్చుకొని.. చివరకు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. పోలీసులను ఆశ్రయిస్తే పలుకుబడితో పోలీసు అధికారిని మేనేజ్‌ చేసి, ఆ పంచాయితీని పెద్ద మనుషుల వద్దకు చేరేలా చేశాడు. వారు ఆ యువతి శీలానికి రూ.లక్ష వెలకట్టారు. తన శీలానికి వెలకడతారా? అని ప్రశ్నించినందుకు పెద్ద మనుషుల సమక్షంలోనే కొందరు ఆమెను చితకబాదారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటన శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బయ్యారం మండలం సోమ్లా తండాకు చెందిన 22 ఏళ్ల గిరిజన యువతి, బయ్యారానికి చెందిన కొండూరు కార్తీక్‌(25) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి కార్తీక్‌ ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోనని నిరాకరించాడు. దీంతో ఆమె బయ్యారం పోలీసులను ఆశ్రయించింది. అక్కడి పోలీసు అధికారిని కార్తీక్‌ మేనేజ్‌ చేయగా, గ్రామ పెద్దలతో మాట్లాడుకోమని చెప్పారు. దీంతో బయ్యారం మండలం సత్యనారాయణపురం మామిడి తోటలో పంచాయితీ పెట్టారు. అక్కడ యువతి శీలానికి రూ.లక్ష వెల కట్టారు. బీఈడీ వరకు చదువుకున్న గిరిజన యువతి, నా శీలానికి వెలకడతారా? అని పెద్ద మనుషులను ప్రశ్నించడంతో అక్కడున్న పెద్ద మనుషుల్లో కొందరు ఆమెను చిదకబాదారు. మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం నిద్ర మాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన వారు చేతిపై రాసి ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆధా రంగా కుటుంబసభ్యులకు సమాచారమి చ్చారు. ఆమె ప్రస్తుతం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనను కార్తీక్‌ మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారు పట్టించుకొని ఉంటే, ఇంతవరకు వచ్చేది కాదని ఆ యువతి విలపించింది.  

ప్రియుడితోపాటు మరో ఇద్దరిపై కేసు 
బయ్యారం(ఇల్లందు): ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడితోపాటు అతడికి సహకరించిన ఇద్దరిపై శనివారం బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసిన కార్తీక్‌తోపాటు ప్రియాంకను బెదిరించి, దాడి చేసిన టీఆర్‌ఎస్‌ నాయకుడు వేల్పుల శ్రీనివాస్, అతడి భార్య పార్వతిలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు