న్యూ ఇయర్‌ వేడుకల్లో అపశ్రుతి

2 Jan, 2019 12:35 IST|Sakshi
అరుణ్‌ మృతదేశం, అరుణ్‌( ఫైల్‌)

హసన్‌పర్తి: కొత్త సంవత్సరం వేడుకలు మూడు  కుటుంబాల్లో విషాదం నింపాయి. వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఓ ఆటో డ్రైవర్‌ అనుమానా స్పద స్థితిలో మృతిచెందగా, వేడుకల అనంతరం  నిద్రిస్తున్న క్రమంలో ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో చనిపోయింది.  ఓ యువకుడు మూత్రవిసర్జనకు వెళ్లి డ్రెయినేజీ వద్ద పడి ప్రాణాలు వదిలాడు.పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని 58వ డివిజన్‌ వంగపహాడ్‌కు చెందిన దోమ అరుణ్‌(28)కు భార్య కళ్యాణి, ఆరు నెలల కూతురు ఉన్నారు. అరుణ్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి బైరాన్‌పల్లి శివారులోని ఓ మామిడితోటలో జరిగిన న్యూ ఇయర్‌ వేడుకల్లో పాల్గొని  ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అతడు మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో మృతిచెంది కనిపించాడు.

హత్యచేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
కాగా దోమ అరుణ్‌ను హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన న్యూయర్‌ గొడవలే  హత్యకు కారణంగా వారు పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యుల డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం ఆటో బోల్తాపడడంతో అరుణ్‌ మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. ఇంటికి వచ్చే క్రమంలో మూలమలుపు వల్ల ఆటో బోల్తాపడినట్లు పేర్కొంటున్నారు.

భయపడ్డారా ?
వంగపహాడ్‌ శివారులోని మూలమలుపు వద్ద ఆటో బోల్తాపడిన దృశ్యాన్ని అదే మార్గంలో వస్తున్న అతడి స్నేహితులు చూసినట్లు తెలిసింది. ఆటోను పక్కకు జరి పి దాని కిందన ఉన్న అరుణ్‌ను పరిశీలించగా ఎలాంటి చలనం లేకపోవడంతో భయపడిన ఆ యువకులు ఎవరికి చెప్పకుండా మరో మార్గం నుంచి ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కాగా  రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ విందు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అరుణ్‌తోపాటు న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

విచారణ చేçస్తున్నాం..
అరుణ్‌ మృతిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్పై సుధాకర్‌ తెలిపారు. వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు చెప్పారు. ఆటో బోల్తాపడడంతో అరుణ్‌ మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు.  –సుధాకర్, ఎస్సై  

మరిన్ని వార్తలు