కోలుకుంటున్న భూ బాధితులు

15 Apr, 2018 12:18 IST|Sakshi
తీవ్ర గాయాలపాలై లేవలేని స్థితిలో ఉన్న మహాలక్ష్మి, వెంకట లక్ష్మి

ఎంపీటీసీ కుమారుడు, తహసీల్దార్‌తో సహా ఎనిమిది మందిపై ఫిర్యాదు

సాక్షి, బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలోని ఎంబీపాలెంలో గ్రామస్తుల దాడిలో గాయపడిన మహిళలు అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తమ భూమిలో జీడి పిక్కలు సేకరిస్తున్న గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు కలం వెంకట లక్ష్మి, అప్పాన మహాలక్ష్మిలపై అదే గ్రామానికి చెందిన కొందరు ఈ భూములు తమవంటూ శుక్రవారం దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే.

అపస్మారక స్థితికి చేరిన ఇద్దరినీ  108లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల, చేతులు, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలైన  అక్కాచెల్లెళ్లు మంచానికే పరిమితం అయ్యారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోడానికి నాయకులు, అధికారులు కలిసి తమను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. తమకు న్యాయం జరగడం లేదంటూ ఆరోపించారు.

సెలవులతో ధర్నా వాయిదా..
మహిళలపై దాడికి నిరసనగా శనివారం బుచ్చెయ్యపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు బాధిత మహిళల కుటుంబీకులు, గ్రామస్తులు యోచించారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులతో అధికారులు  అందుబాటులో ఉండరని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ఎనిమిది మందిపై ఫిర్యాదు
బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కుమారుడు కరణం నూకరాజుతో పాటు తహసీల్దార్‌ కె.వెంకట శివ, గ్రామానికి చెందిన అప్పాన అప్పలనాయుడు, ముత్యాలు, బేరా పడమటమ్మ, బర్ల చిన్న, పురిటి రాజు, సత్యంలు తమపై దాడితోపాటు అత్యాచారానికి ప్రయత్నించారని, బలవంతంగా భూములను లాక్కోవడానికి చూస్తున్నారని బాధితులు బుచ్చెయ్యపేట ఎస్‌ఐకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్‌ఐ కృష్ణారావు తెలిపారు. తహసీల్దార్‌ తమను డబ్బులు డిమాండ్‌ చేశారని, తన గదిలోకి రమ్మన్నారని బాధిత మహిళలు ఆరోపించారు.

మరిన్ని వార్తలు